
నేడు కొండగట్టు అంజన్న సన్నిధికి పవన్ కళ్యాణ్
ఉత్తర తెలంగాణా జిల్లాల్లో అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దశ మార్చడమే లక్ష్యంగా భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేటాయించిన సుమారు రూ. 35.19 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 3న) శంకుస్థాపన చేయనున్నారు.
ఈ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా భక్తుల వసతి సమస్యను తీర్చేందుకు ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు . దీంతో పాటు ఆలయ ప్రాంగణంలో తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల అభివృద్ధి వంటి మౌలిక వసతులను టీటీడీ నిధులతో మెరుగుపరచనున్నారు. ఈ పనులు పూర్తయితే ఏటా హనుమాన్ జయంతి వంటి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే సమయాల్లో వసతి ఇబ్బందులు తొలగి, దర్శనం మరింత సులభతరం అవుతుందని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ పర్యటన దృష్ట్యా జగిత్యాల జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రక్షణ పరంగా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 1100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ కాలేజీ వద్ద హెలిప్యాడ్‌ను సిద్ధం చేయడంతో పాటు, ట్రాఫిక్ మళ్లింపు రద్దీ నియంత్రణపై ప్రత్యేక నిఘా ఉంచారు.
పర్యటన షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, తర్వాత స్థానిక బృందావన్ రిసార్ట్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. టీటీడీ సహకారంతో చేపడుతున్న ఈ నిర్మాణాలు కొండగట్టు ఆలయ ప్రతిష్టను మరింత పెంచుతాయని, భక్తులకు మెరుగైన సేవలందించడంలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు నిలవనుంది.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్ల నిధుల మంజూరులో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. చొప్పదండి ఎమ్మెల్యే మెదిపల్లి సత్యం చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఆయన టీటీడీ పాలక మండలికి వివరించడంతో ఆలయ అభివృద్ధి ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది.
