
నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ కీలక సమావేశం
తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఏపీ జలదోపిడీ అంశం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో సమరశంఖం పూరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’ చేపట్టాల్సిన అవసరంపై కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేవలం 45 టీఎంసీల నీటికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టుకు 91 టీఎంసీల నీటిని కేటాయించగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వద్ద మోకరిల్లిందని కేసీఆర్ విమర్శించనున్నట్లు తెలుస్తోంది.
నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, దీనిపై తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరమని కేసీఆర్ వ్యాఖ్యానించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతాంగ ప్రయోజనాల కోసం ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోందని స్పష్టం చేయనున్నారు.
అలాగే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ విమర్శించనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాల రూపురేఖలు ఖరారు చేసే దిశగా కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
