
నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా ఈ పర్యటన సాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
ఈ పర్యటనలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహకారం పెండింగ్ నిధుల విడుదల అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో రాష్ట్ర భద్రత పరిపాలనా అంశాలు, అదేవిదంగా కేంద్ర–రాష్ట్ర సమన్వయం గురించి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ కేటాయింపులు, పెండింగ్ గ్రాంట్లు, రుణాల అంశాలపై ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయనున్నారు.
అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టులు, జల జీవన్ మిషన్ వంటి పథకాల పురోగతిపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, అశ్విని వైష్ణవ్‌లతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రతిపాదిత మౌలిక వసతుల ప్రాజెక్టులు, రహదారులు, రైల్వే, టెలికాం, పారిశ్రామిక పెట్టుబడులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కేంద్ర సహకారాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అన్ని సమావేశాలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.
