Let's talk: editor@tmv.in
నేడు కాశీ విశ్వనాథ్ ఆలయంలో మహిళలకు ఉచిత దర్శనం

నేడు కాశీ విశ్వనాథ్ ఆలయంలో మహిళలకు ఉచిత దర్శనం

Gaddamidi Naveen
8 మార్చి, 2026

ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు నేడు ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక ప్రవేశ సౌకర్యం కల్పిస్తున్నట్లు కాశీ విశ్వనాథ్ ఆలయ బోర్డు ప్రకటించింది.

శ్రీ కాశీ విశ్వనాథ స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, ఆలయ సముదాయంలోని గేట్ నం. 4-బి ద్వారా మహిళా భక్తులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. ఈ ప్రత్యేక ఏర్పాటుతో మహిళలు సులభంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సదుపాయం కాశీ నగరానికి చెందిన మహిళలకు మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళా భక్తులందరికీ వర్తిస్తుంది. గేట్ నం. 4-బి ద్వారా ప్రవేశించే మహిళలకు ఎలాంటి టికెట్ లేదా రుసుము అవసరం ఉండదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తిని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది.

తల్లులకు ప్రాధాన్యత

ఇంకా, చిన్నపిల్లలను చేతుల్లో మోసుకుని వచ్చే తల్లులకు ఆలయ దర్శనంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిన్నపిల్లలతో వచ్చే మహిళలకు ప్రత్యేక సహాయం అందిస్తూ త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకునేలా ఆలయ సిబ్బంది సహకరిస్తారు. పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

స్థానికుల షెడ్యూల్‌లో మార్పు లేదు..

అయితే, కాశీ ప్రాంత నివాసితులకు ఇప్పటికే అమలులో ఉన్న ప్రత్యేక దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఆలయ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్థానిక భక్తులకు కేటాయించిన దర్శన సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ సమయంలో స్థానికుల కోసం ఇప్పటికే అమల్లో ఉన్న ప్రత్యేక దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఆలయ సీఈఓ విశ్వ భూషణ్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయ ట్రస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. సనాతన ధర్మ అనుచరులు, శివభక్తులు, మహిళలందరిపై విశ్వేశ్వరుని ఆశీస్సులు, దైవిక శక్తి కృప ఎల్లప్పుడూ ఉండాలని, అందరికీ సుఖశాంతులు కలగాలని ట్రస్ట్ ఆకాంక్షించింది.

నేడు కాశీ విశ్వనాథ్ ఆలయంలో మహిళలకు ఉచిత దర్శనం - Tholi Paluku