Let's talk: editor@tmv.in
నేడు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం

నేడు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం

Pinjari Chand
10 ఏప్రిల్, 2026

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణలు, ప్రతిపాదిత డిలిమిటేషన్ ప్రక్రియతో పాటు పశ్చిమ ఆసియా పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శుక్రవారం జరగనుంది. పార్టీ అగ్రనేతలు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. 2029 లోక్‌సభ ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు, అలాగే లోక్‌సభ స్థానాలను పెంచే డిలిమిటేషన్ ప్రక్రియపై పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన బిల్లులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచి, అందులో 273 స్థానాలను మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

తమిళనాడు, కేరళంలకు నష్టం

ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ముందుగానే అమలు చేయాలనే పేరుతో ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని పార్టీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా విమర్శించింది. డిలిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టడం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల తమిళనాడు, కేరళం వంటి కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పార్టీ అభిప్రాయపడింది. అందువల్ల ఈ విషయంలో కేంద్రం జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించింది.

ఇదే సమావేశంలో పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవల ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణపై పార్టీ నాయకత్వం సమీక్షించనుంది. పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తోంది. కాల్పుల విరమణ చర్చల్లో భారత్ పాత్ర కనిపించలేదని ప్రశ్నిస్తూ, పాకిస్తాన్ పాత్ర ప్రస్తావన రావడం ప్రధాని మోడీ వ్యక్తిగత దౌత్యానికి పెద్ద దెబ్బ అని పార్టీ వ్యాఖ్యానించింది.

నేడు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం - Tholi Paluku