
నేడు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా పార్టీలో తనను పక్కన పెడుతున్నారనే అసంతృప్తితో ఉన్న ఆయన, నేడు (బుధవారం) రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మంగళవారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, గత 20 నెలలుగా జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం ప్రాణపణంగా పనిచేశాను. కానీ, మొదటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారిని గాలికి వదిలేసి, కనీసం సభ్యత్వం కూడా లేని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను వీడటం బాధాకరమే అయినప్పటికీ, తనకు వేరే మార్గం లేదని ఆయన తెలిపారు.
జీవన్ రెడ్డి రాజీనామా వార్తల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలోనే కొనసాగాలని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకోవడానికి సుముఖంగా లేరని సమాచారం. ఈ పరిణామం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా, రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.
