
నేడు ఏపీకి అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇది ఈ నెల 28న మంగళవారం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
'మొంథా' తుపాను ప్రభావంతో నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తీరం వెంబడి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలకోసం 9 ఎస్‌డీఆర్‌ఎఫ్, 7ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్‌లో సిద్ధంగా ఉన్నాయని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
జిల్లాలకు టిఆర్-27 కింద నిధులు మంజూరు
తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లాలకు టిఆర్-27 కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ.19 కోట్ల నిధులు మంజూరు చేశామని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నిధులను బాధితులను సహాయ శిబిరాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు అత్యవసర మరమ్మతులు, ఇతర సహాయ కార్యకలాపాలు కోసం వినియోగించాలని తెలిపారు.
