
నేడు ఆర్ఎస్ఎస్ ఉత్సవాలకు ప్రధాని
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1 (బుధవారం)న న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని పీఎంఓ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రధాని మోడీ తపాలా బిళ్లను, నాణేన్ని విడుదల చేయనున్నారు. అలాగే సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు.
మన్ కీ బాత్ లో ప్రస్తావన
ఇటీవల ప్రధాని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణాన్ని గురించి ప్రస్తావించారు. అందులో ఆర్‌ఎస్ఎస్ దేశానికి చేసిన సేవలను, అపూర్వమైన,స్పూర్తి దాయకమైన సేవలను ప్రశంసించారు. అలాగే ఈ వేడుకకు ఓ విశిష్టత ఉందన్నారు. 1925లో విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ ను బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు.గురూజీ దేశానికి సేవ చేయాలనే గొప్ప లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న భారతదేశం నాడు విదేశీ శక్తుల చేతుల్లో ఉందని, బానిసత్వంలో మగ్గుతూ, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న తరుణంలో, ప్రజలు ఆత్మనూన్యత పరిస్థితుల్లో ఉన్న సమయంలో రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ ను స్థాపించారని గుర్తు చేశారు.
ఈ వందేళ్ల ప్రయాణం అద్భుతంగా, అపూర్వంగా స్పూర్తిదాయంగా సాగిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆర్‌ఎస్ఎస్ ‘దేశం ముందు’ అనే విధానాన్ని అనుసరించిందని,తుపానులు, భూకంపాలు, తదితర ప్రకృతి వైపరీత్యా సమయాల్లో దేశానికి దన్నుగా నిలిచిందని కొనియాడారు. పౌరులలో సామాజిక, సాంస్కృతిక భావన, క్రమశిక్షణ, దేశ సేవ లక్ష్యంతో స్థాపించిన సంస్థ మరింతగా మనుగడ సాధించాలని, దేశసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ సేవకులకు శుభాకాంక్షలు తెలిపారు.
