
నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు లో భాగంగా నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే సంకేతంగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున ఆవిష్కరణకు సిద్ధమవుతోంది.
గతేడాది ఇదే తేదీన, 2024 డిసెంబర్ 9న, తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రజల ఆకాంక్షలు, సాహస స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ పోరాటాల పట్ల గౌరవ సూచకంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తోంది.
ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ 7 డిసెంబర్ 2025న అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణరావు జారీ చేసిన మెమో ప్రకారం, డిసెంబర్ 9 ఉదయం 10 గంటలకు ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠాత్మకంగా ఆవిష్కరించాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను గ్రామస్థాయికి మరింత చేరువ చేసి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో జరిగే ఈ ఆవిష్కరణలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని, ఆవిష్కరణ అనంతరం ఫోటోలతో కూడిన అనుసరణ నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ములుగు, నారాయణపేట, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలను మినహాయించి మిగతా అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలను అమలు చేయాల్సి ఉంది.ఈ కార్యక్రమం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల రాష్ట్రవ్యాప్త వేడుకలకు ముఖ్య ఆకర్షణగా నిలవనుంది.
