Let's talk: editor@tmv.in
నేటి నుంచే మేడారం మహాజాతర

నేటి నుంచే మేడారం మహాజాతర

Gaddamidi Naveen
28 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, దక్షిణ భారత కుంభమేళాగా పిలవబడే 'మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర' బుధవారం (జనవరి 28) నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సంబరం జరగనుంది. ఈ మహాజాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి సుమారు 3కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో జరిగే ఈ మహా జాతరను ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక సమాగమాల్లో ఒకటిగా భావిస్తారు. గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మల దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్త్ళున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని, మొక్కుల రూపంలో బంగారం (బెల్లం) సమర్పించుకుంటున్నారు. వనదేవతల నామస్మరణతో మేడారం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మేడారంకు భక్తులు ట్రాక్టర్లు, బస్సులు ప్రైవేటు వాహనాల్లో భారీగా రావడంతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి.

జాతర ప్రారంభం, ముఖ్య ఘట్టాలు

జనవరి 28 సాయంత్రం 6 గంటలకు గిరిజన పూజారులు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించడంతో మహా జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.అలాగే జనవరి 29 సాయంత్రం 6 గంటలకు గిరిజనుల వనదేవత సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించబడతారని అధికారులు తెలిపారు. ఈ ఘట్టాన్ని అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.

ప్రభుత్వ ఏర్పాట్లు – భారీ బడ్జెట్

రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఆరు నెలల ముందుగానే జాతర ఏర్పాట్లను ప్రారంభించింది. జనవరి 19న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణంలో పునర్నిర్మించిన గద్దెలను ప్రారంభించారు. గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల పునర్నిర్మాణానికి రూ.101 కోట్లు ఖర్చు చేయగా, భక్తుల సౌకర్యాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులకు మరో రూ.150 కోట్లు వెచ్చించింది.

పరిపాలనా, భద్రతా చర్యలు

జాతర నిర్వహణలో 21 ప్రభుత్వ శాఖలు, సుమారు 42,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. భక్తుల రాకపోకలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహా జాతర ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లు, 42 సెక్టార్లుగా విభజించి నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టారు.

రవాణా, వైద్య సదుపాయాలు

భక్తుల రాకపోకల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) సుమారు 4,000 ప్రత్యేక బస్సులు నడపనుంది. వైద్య సేవల కోసం 5,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు అందుబాటులో ఉంచనున్నారు.

డిజిటల్ సౌకర్యాలు

భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ చాట్‌బాట్ను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా యాప్‌లో ఎస్.వో.ఎస్ అలర్ట్, ఫిర్యాదుల నమోదు వంటి భద్రతా మాడ్యూల్‌ను కూడా ఏర్పాటు చేశారు.

మేడారంలో 'చిల్డ్రన్ ట్రాకింగ్ & మానిటరింగ్ సిస్టమ్'

మేడారం జాతరలో తప్పిపోయే చిన్నారులను, ఇతర భక్తులను త్వరగా గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. వొడాఫోన్ సహకారంతో ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ కింద క్యూఆర్‌ కోడ్‌ రిస్ట్ బ్యాండ్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ రిస్ట్ బ్యాండ్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే, సంబంధిత వ్యక్తి తల్లిదండ్రులు లేదా గార్డియన్ల వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి.ప్ర‌తి రోజు లక్షలాది మంది హాజరయ్యే మేడారం జాతరలో భద్రత మరింత మెరుగుపడేందుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది. ఈ సరికొత్త సదుపాయాన్ని తెలంగాణ డీజీపీ ప్రారంభించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.

పర్యావరణ పరిరక్షణ

ఈసారి జాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశుభ్రత, అటవీ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

చారిత్రక ప్రాధాన్యం

ప్రభుత్వం ఈ జాతరకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఇటీవల మేడారంలోనే నిర్వహించారు. ఇది హైదరాబాద్ వెలుపల జరిగిన మొదటి కేబినెట్ సమావేశంగా చరిత్రలో నిలిచింది.

జాతర నేపథ్యం

ఎటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో, దండకారణ్య అటవీ ప్రాంతంలో ఉన్న మేడారం, గిరిజనుల విశ్వాసాల కేంద్రం. 12వ శతాబ్దంలో కరువు సమయంలో గిరిజనులపై పన్నులు విధించిన కాకతీయ పాలకులపై సమ్మక్క, సారలమ్మ తల్లి, కూతుళ్లు సాగించిన తిరుగుబాటుకు గుర్తుగా ఈ మహా జాతర నిర్వహించబడుతోంది. ప్రతి రెండేళ్లకోసారి దేవతలు మేడారానికి వచ్చి భక్తులను దర్శిస్తారని విశ్వసిస్తూ మహా జాతర నిర్వహిస్తారు. భక్తి, చరిత్ర, గిరిజన సంస్కృతి మేళవించిన మేడారం మహా జాతర మరోసారి కోట్లాది భక్తులతో ఘనంగా జరగనుంది.

మేడారం జాతరలో మావోరీ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణ

సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా అంతర్జాతీయ సాంస్కృతిక సందడి నెలకొంది. న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ గిరిజన తెగ ప్రతినిధులు జాతరకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి సీతక్క చొరవతో నిర్వహించిన ఈ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో మావోరీ బృందం పాల్గొని తమ సంప్రదాయాలను పరిచయం చేసింది.

మావోరీ ప్రతినిధులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ సంప్రదాయ నృత్యమైన ‘హాకా’ను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో మావోరీ తెగలో చేసే ఈ నృత్యం శౌర్యం, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వారు వివరించారు.

మేడారం జాతరకు విదేశీ గిరిజన ప్రతినిధులు రావడం గిరిజన సంస్కృతుల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం జాతర అంతర్జాతీయ ప్రాధాన్యతను చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు.