

నేటి నుంచే ‘పోషణ్ పఖ్వాడా 2026’
దేశవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని నిర్మూలించి, ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 8వ ‘పోషణ్ పఖ్వాడా 2026’ వేడుకలకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ 9 నుండి 23 వరకు పదిహేను రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది "జీవితంలోని మొదటి ఆరేళ్లలో గరిష్ట మెదడు వికాసం" అనే విశిష్టమైన థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
జాతీయ స్థాయి ప్రారంభోత్సవం
ఈ మెగా ఈవెంట్‌ను నేడు (ఏప్రిల్ 9న) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, సెక్రటరీ అనిల్ మాలిక్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఎన్ఐసి వెబ్‌కాస్ట్, మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
మొదటి ఆరేళ్ల ప్రాముఖ్యత - శాస్త్రీయ దృక్పథం
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, మనిషి మెదడులో 85 శాతం అభివృద్ధి ఆరు సంవత్సరాల వయస్సులోపే పూర్తవుతుంది. ముఖ్యంగా శిశువు గర్భంలో ఉన్నప్పటి నుండి మొదటి 1,000 రోజులు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో లభించే సరైన పోషకాహారం, తల్లిదండ్రుల స్పందన, ప్రాథమిక అభ్యాసం పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఏడాది థీమ్‌ను ఖరారు చేశారు.
ఫోకస్ ఏరియాలు
ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో ఐదు కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు:
• తల్లి, శిశు పోషణ: గర్భిణీలకు సరైన ఆహారం, శిశువులకు తల్లి పాలు, ఆరు నెలల తర్వాత అనుబంధ పోషకాహారంపై అవగాహన.
• మెదడు ఉద్దీపన (0-3 ఏళ్లు) - చిన్న పిల్లలతో మాట్లాడటం, ఆడటం ద్వారా వారి ఆలోచనా శక్తిని పెంచడం.
• ఆటపాటల విద్య (3-6 ఏళ్లు) - అంగన్‌వాడీల్లో ఆటల ద్వారా విద్యాబోధన చేసి పాఠశాలకు సిద్ధం చేయడం.
• స్క్రీన్ టైమ్ నియంత్రణ ద్వారా పిల్లలు ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం.
• అంగన్‌వాడీల బలోపేతం చేసి కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా కేంద్రాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.
ప్రజల భాగస్వామ్యం ద్వారానే సాద్యం -మోడీ
"సుసంపన్నమైన పోషకాహారం పొందిన బిడ్డలే బలమైన దేశానికి పునాది" అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పోషణ్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ప్రతి తల్లిని, బిడ్డను పలకరించే ఒక ప్రజా ఉద్యమం అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశం పోషకాహార లోపం నుండి విముక్తి పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో స్థానిక సంస్థల సమన్వయంతో కార్యక్రమాలు జరుగుతాయి. 'పోషణ్ పంచాయతీలు', అవగాహన సదస్సులు, పిల్లల కోసం ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తల్లులకు అవసరమైన సలహాలు అందిస్తారు. క్షేత్రస్థాయిలో వారు చేస్తున్న కృషిని గుర్తించి ఈ వేదికపై వారిని సత్కరించనున్నారు.
మెదడు వికాసం కోసం ప్రత్యేక చర్యలు
కేవలం ఆహారం ఇవ్వడమే కాకుండా, చిన్న వయస్సులోనే పిల్లల మేధస్సును ఎలా పదును పెట్టాలో తల్లిదండ్రులకు నేర్పిస్తారు. స్పందనాత్మక సంరక్షణ ద్వారా పిల్లల సామాజిక, మానసిక ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం ఈ ఏడాది లక్ష్యం.
అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల ద్వారా ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రిత్వ శాఖ కోరుతోంది. దీనివల్ల సేవల నాణ్యత పెరిగి చిట్టచివరి బిడ్డకు కూడా పోషణ అందుతుంది.
పోషణ్ పఖ్వాడా 2026 ద్వారా దేశంలోని ప్రతి పౌరుడిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడమే లక్ష్యం. పోషకాహారం, సంరక్షణ, ప్రాథమిక విద్య అనే మూడు సూత్రాలతో ఆరోగ్యవంతమైన, విద్యావంతులైన, శక్తివంతమైన నవ భారతాన్ని నిర్మించే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక అడుగు వేయనుంది.
