
నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు నేడు నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు కొనసాగుతాయని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది.
నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సమావేశాల నిర్వహణ, భద్రత, సభ్యులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సభలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు స్పీకర్, చైర్మన్ దిశానిర్దేశం చేశారు. రోడ్లు, భవనాల శాఖ తరపున అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన అన్ని పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రోటోకాల్ అంశాలపై నివేదికలను సమర్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న ఈ బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ వైఖరిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సభకు పూర్తిస్థాయిలో హాజరవుతారా లేక గతంలో లాగే కేవలం హాజరు కోసమే వచ్చి వెళ్లిపోతారా అన్నది చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే గండిపేటలోని రిసార్ట్‌లో తమ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించి శిక్షణ ఇచ్చింది. మరోవైపు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులను స్పీకర్ తోసిపుచ్చడం, సుప్రీంకోర్టులో పిటిషన్లు డిస్పోజ్ కావడంతో సభలో ఈ అంశంపై గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, ఈసారి బడ్జెట్ చర్చల్లో ఏ విధమైన పోరాట పంథాను అనుసరిస్తుందో చూడాలి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాదిరిగానే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమయ్యారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వీరు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నారు. బడ్జెట్ కేటాయింపులు, నిరుద్యోగ భృతి, కేంద్ర నిధుల వినియోగంపై అసెంబ్లీలో గళం విప్పాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.
