
నేటి నుంచీ అన్ని సినిమాహాళ్లలో ‘సబ్ కీ యోజన, సబ్ కా వికాస్’ అవగాహన చిత్రం
పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (PPC) అయిన 'సబ్ కీ యోజన, సబ్ కా వికాస్' పై రూపొందించిన ప్రభుత్వ సేవల అవగాహన (PSA) చిత్రం నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలో ప్రదర్శనకు సిద్ధమైంది. రెండు నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రం అక్టోబర్ 24, 2025 నుంచి నవంబర్ 6, 2025 వరకు దేశవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరికీ అందేలా చూడాలన్న ప్రధానమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీ అభివృద్ధి ప్రణాళికా రూపకల్పనలో ప్రజలకు అవగాహన కల్పించడం, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి పనుల్లో ప్రతి పౌరుడి పాత్రను ఈ అవగాహన చిత్రం స్పష్టం చేస్తుంది.
ప్రదర్శన వివరాలు:
సినిమా ప్రారంభానికి ముందు, ఇంటర్వెల్ లో చివరి ఐదు నిమిషాల సమయంలో ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శిస్తారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో తప్ప, దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలో ప్రభుత్వ సేవల అవగాహన చిత్రాల ప్రదర్శన మార్గదర్శకాల ప్రకారం ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (పీపీసీ):
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (పీపీసీ) 2025-26 కార్యక్రమం అక్టోబర్ 2, 2025న ప్రారంభమైంది. ప్రత్యేక గ్రామసభ సమావేశాల ద్వారా, స్థానిక ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తూ, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా సమ్మిళిత పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయటానికి ఈ కార్యక్రమం పంచాయతీలకు వీలు కల్పిస్తుంది.
'సబ్ కీ యోజన, సబ్ కా వికాస్' ప్రచారం 2018లో ప్రారంభమైనప్పటి నుంచి కీలక కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఇది గ్రామీణ భారతంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం, భాగస్వామ్య ప్రణాళికను సంస్థాగతం చేయటం, స్వయం పరిపాలన పునాదులను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రణాళికల పురోగతి:
ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ప్రకారం, 2019-20 నుంచి ఇప్పటివరకు 18.13 లక్షలకు పైగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు (GPDP), బ్లాక్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు (BPDP), జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP)లు అప్ లోడ్ అయ్యాయి. వాటిలో 2025–26 సంవత్సరానికి సంబంధించి 2.52 లక్షల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కూడా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈ అవగాహన చిత్రాన్ని ప్రదర్శించడం ద్వారా, పంచాయతీ రాజ్ సంస్థలతో (PRI) పౌరులు మరింతగా మమేకమై స్థానిక పాలన, గ్రామీణాభివృద్ధిలో చురుగ్గా పాల్గొనేలా చేయాలని మంత్రిత్వ శాఖ ఆకాంక్షిస్తోంది.
