
నేటి నుంచి 2 రోజుల పాటు బెంగాల్, అస్సాంలలో ప్రధాని మోడీ పర్యటన
తూర్పు భారతం మౌలిక సదుపాయాల పరంగా సరికొత్త రూపు సంతరించుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైల్వే, రహదారులు, అంతర్గత జలరవాణా, పోర్టులు, సాంస్కృతిక రంగాలకు సంబంధించి సుమారు రూ.11,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
తొలి వందేభారత్ స్లీపర్ ప్రారంభం
ప్రధాన మంత్రి మోడీ జనవరి 17న మధ్యాహ్నం 12.45 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ చేరుకుని, హౌరా–గౌహతి (కామాఖ్య) మధ్య నడిచే భారత్ తొలి వందేభారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు.
వందేభారత్ ఏసీ స్లీపర్ రైలు ప్రత్యేకతలు
పూర్తిగా ఏసీ సౌకర్యాలతో రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైలు, విమాన ప్రయాణానికి సమానమైన అనుభూతిని అందించనుంది. దీని ద్వారా హౌరా–గౌహతి మార్గంలో ప్రయాణ సమయం సుమారు 2.5 గంటలు తగ్గనుంది. ఉత్తర తూర్పు ప్రాంతాలకు పర్యాటకం, ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రలకు ఇది భారీ ఊతమివ్వనుంది.
రూ.3,250 కోట్ల రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు
మాల్దాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని రూ.3,250 కోట్ల విలువైన రైల్వే, రహదారి మౌలిక వసతుల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో బాలూర్ఘాట్–హిలీ కొత్త రైల్వే లైన్, న్యూ జల్పాయ్‌గుడిలో ఆధునిక ఫ్రైట్ మెయింటెనెన్స్ సదుపాయాలు, సిలిగురి లోకో షెడ్ అప్‌గ్రేడేషన్, జల్పాయ్‌గుడిలో వందేభారత్ మెయింటెనెన్స్ కేంద్రాల ఆధునీకరణ ఉన్నాయి.
రైల్వే విద్యుదీకరణ, అమృత్ భారత్ రైళ్లు
న్యూ కూచ్‌బెహార్–బామన్‌హాట్, న్యూ కూచ్‌బెహార్–బోక్సిర్‌హాట్ రైల్వే మార్గాల విద్యుదీకరణను ప్రధాని దేశానికి అంకితం చేస్తారు. అలాగే న్యూ జల్పాయ్‌గుడి–నాగర్‌కోయిల్, న్యూ జల్పాయ్‌గుడి–తిరుచిరాపల్లి, అలీపుర్దువార్–బెంగళూరు, అలీపుర్దువార్–ముంబయి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రాధికాపూర్–బెంగళూరు, బాలూర్ఘాట్–బెంగళూరు రైళ్లు కూడా ప్రారంభమవుతాయి.
నాలుగు లైన్లుగా ఎన్‌హెచ్-31డి అభివృద్ధి
ఎన్‌హెచ్–31డిలోని ధూప్‌గురి–ఫలకాటా విభాగాన్ని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి ప్రాజెక్టు ఉత్తర బెంగాల్‌లో ప్రయాణికులు, సరుకు రవాణాకు మరింత సౌలభ్యం కల్పించనుంది.
సింగూర్‌లో రూ.830 కోట్ల అభివృద్ధి పనులు
జనవరి 18న హూగ్లీ జిల్లా సింగూర్‌లో ప్రధాని రూ.830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బాలాగఢ్‌లో ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్, రోడ్డు ఓవర్ బ్రిడ్జితో కూడిన ఎక్స్‌టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్‌కు శంకుస్థాపన చేస్తారు. సుమారు 900 ఎకరాల్లో అభివృద్ధి కానున్న ఈ ప్రాజెక్టుతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే హూగ్లీ నదిలో ప్రయాణానికి ఎలక్ట్రిక్ క్యాటమరాన్, జయరాంబటి–మయనాపూర్ కొత్త రైల్వే లైన్, మూడు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తారు.
రూ.6,950 కోట్లతో కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్‌కు భూమిపూజ
అస్సాంలో జనవరి 17న గౌహతిలో జరిగే ‘బగురుంబ ద్హౌ-2026’ బోడో సాంస్కృతిక ఉత్సవంలో ప్రధాని పాల్గొంటారు. సుమారు 10,000 మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శించే సంప్రదాయ 'బగురుంబ' నృత్యాన్ని ఆయన వీక్షిస్తారు. జనవరి 18న రూ.6,950 కోట్ల విలువైన కాజీరంగ ఎలివేటెడ్ కారిడార్‌కు భూమి పూజ చేసి, గువాహటి–రోహతక్, దిబ్రూగఢ్–లక్నో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఉత్తర అస్సాం రవాణా అభివృద్ధికి దోహదపడనున్నాయి.
