
నేటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా-2026 సదస్సు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 23వ అంతర్జాతీయ బయోఏషియా–2026 సదస్సు ఈ నెల 17, 18 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరగనుంది. ఈ ప్రపంచ స్థాయి సదస్సును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సదస్సు ద్వారా తెలంగాణను గ్లోబల్ బయోసైన్స్ కేంద్రంగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ ఏడాది సదస్సు ప్రధాన ఇతివృత్తంగా ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో విప్లవాత్మక పరిణామాలు’ను ఎంపిక చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు వైద్య విధానాలు, పరిశోధనల దిశ వంటి కీలక అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. టెక్‌బయో ఇన్నోవేషన్స్‌లో భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ సదస్సు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
సదస్సు ప్రారంభానికి ముందు లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే ప్రధాన సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు, బయోటెక్ నిపుణులు పాల్గొని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననుండగా, కీలకోపన్యాసాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, అలాగే అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ ఆమ్జెన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ ముఖ్య ప్రసంగాలు చేయనున్నారు.
సైన్స్, సాఫ్ట్‌వేర్ అండ్ సప్లై చైన్, నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా, బయోటెక్ రంగాల భవిష్యత్తు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశోధనలు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, గ్లోబల్ హెల్త్ ఇంపాక్ట్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. అదేవిధంగా ‘తెలంగాణ రైజింగ్ 2047 – వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్’ అంశంపై కూడా విస్తృత చర్చలు జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సు ద్వారా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు కొత్త దారులు తెరుచుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
