Let's talk: editor@tmv.in
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

Shaik Mohammad Shaffee
1 డిసెంబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి ఆరు రోజులపాటు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. "ప్రజాపాలన విజయోత్సవాలు" పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పర్యటన ఖరారైంది. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో సీఎం పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఆరు రోజుల పర్యటన షెడ్యూల్

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్‌ ఒకటో తేదీన మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌, 4న ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, 5న వరంగల్ జిల్లాలోని నర్సంపేట, 6న నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 6న పర్యటన ముగిసిన తర్వాత, డిసెంబర్ 8 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణాలకే పరిమితం

ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి పర్యటనలోని కార్యక్రమాలన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఈ పర్యటనకు పంచాయతీ ఎన్నికలతో సంబంధం లేదని, కేవలం పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని సమర్థించుకున్నారు.

ప్రజా పాలన లక్ష్యాలు, కార్యాచరణ

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు, కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ చర్యలను ప్రజలకు వివరిస్తారు. ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి పథకాలపై ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో, మరింత క్రియాశీలకంగా పనిచేయడానికి ఈ పర్యటన దోహదపడుతుంది. బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలతో నేరుగా సంభాషిస్తారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు) పార్టీని బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన - Tholi Paluku