Let's talk: editor@tmv.in
నేటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి ఉత్సవాలు

నేటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి ఉత్సవాలు

Panthagani Anusha
8 ఫిబ్రవరి, 2026

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును దేవస్థానం ప్రతినిధి బృందం అధికారికంగా ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు దేవస్థానం ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష పూజా కార్యక్రమాలకు హాజరై మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలని వారు ఈ సందర్భంగా సీఎంను కోరారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్రంలో చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి సవివరంగా వివరించారు. శివరాత్రి పర్వదినం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం వైద్య సేవలపై తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను అధికారుల బృందం వెల్లడించింది. అదేవిధంగా మహానంది ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.