Let's talk: editor@tmv.in
నేటి నుంచి మహిళల ప్రపంచకప్

నేటి నుంచి మహిళల ప్రపంచకప్

Shaik Mohammad Shaffee
30 సెప్టెంబర్, 2025

క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నమెంట్ సిద్ధమైంది. ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి మ్యాచ్ ఇవాళ భారత్, శ్రీలంక జట్ల మధ్య గౌహతిలో జరగనుంది. నేటి నుంచి ప్రారంభమై నవంబర్ 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ ప్రపంచ కప్‌లో, విజేత ఎవరో తేల్చేందుకు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో 28 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

పాల్గొనే జట్లు: భారత్, శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్

భారత్ వర్సెస్ పాక్ పోరు

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే దాయాది దేశాల పోరు అక్టోబర్ 5, ఆదివారం నాడు జరగనుంది. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌తో సహా పాకిస్తాన్ పాల్గొనే అన్ని మ్యాచ్‌లను భారత్ వెలుపల శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నారు.

భారత మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

సెప్టెంబర్ 30: భారత్ వర్సెస్ శ్రీలంక, ఏసీఏ స్టేడియం, గౌహతి

అక్టోబర్ 5: భారత్ వర్సెస్ పాకిస్తాన్, ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో

అక్టోబర్ 9: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, విశాఖపట్నం

అక్టోబర్ 12: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, విశాఖపట్నం

అక్టోబర్ 19: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, హోల్కర్ స్టేడియం, ఇండోర్

అక్టోబర్ 23: భారత్ వర్సెస్ న్యూజిలాండ్, డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై

అక్టోబర్ 26: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై

వేదికలు, నాకౌట్ మ్యాచ్‌లు

ఈ టోర్నమెంట్ భారత్‌లోని నాలుగు నగరాల్లో, శ్రీలంకలోని ఒక నగరంలో జరుగుతోంది. భారత వేదికలు: డీవై పాటిల్ స్టేడియం (నవీ ముంబై), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం), శ్రీలంక వేదిక: ఆర్. ప్రేమదాస స్టేడియం (కొలంబో).

లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. అక్టోబర్ 29న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ గౌహతి/కొలంబోలో జరుగుతోంది (పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలో జరుగుతుంది). రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 30న నవీ ముంబైలో జరుగుతోంది. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ నవీ ముంబై/ కొలంబోలో జరగనుంది (పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంటే కొలంబోలో జరుగుతుంది).

భారత జట్టు స్వదేశంలో ప్రపంచ కప్‌ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా, అభిమానుల మద్దతుతో అద్భుత ప్రదర్శన చేయాలని చూస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లతో భారత్ తలపడే మ్యాచ్‌లు ఈ ప్రపంచ కప్‌కే హైలైట్‌గా నిలవనున్నాయి.

భారత మహిళా జట్టు బలాలు

ఇటీవల ఇంగ్లండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌లలో విజయం సాధించడం భారత జట్టులో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ప్రతికా రావల్‌తో కూడిన ఓపెనింగ్ భాగస్వామ్యం జట్టుకు అతిపెద్ద బలం. మంధాన ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. ఈ ఏడాది ఆమె నాలుగు వన్డే సెంచరీలు, ముఖ్యంగా ఆస్ట్రేలియాపై వరుసగా రెండు సెంచరీలను సాధించింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గురించి చెప్పాలంటే, ఆమె తన ఐదవ ప్రపంచ కప్‌ ఆడనుంది. ఆమె వన్డే ప్రపంచ కప్‌లలో 50కి పైగా సగటుతో ఆడుతూ టీమిండియాకు కీలక ప్లేయర్‌గా నిలిచింది. ఇటీవల ఇంగ్లండ్‌పై సెంచరీ, ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీ సాధించి ఫుల్ ఫామ్‌లో ఉంది. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ వార్మప్ మ్యాచ్‌లో 66 పరుగులు చేసింది. రిచా ఘోష్, ఆల్-రౌండర్ దీప్తి శర్మ వంటివారు ఆస్ట్రేలియాపై 400 పరుగుల ఛేజింగ్‌లో చివరి వరకు పోరాడి మంచి ప్రదర్శన ఇచ్చారు. గాయం నుండి కోలుకున్న రేణుకా సింగ్ ఠాకూర్ కూడా తిరిగి జట్టులో చేరడం ఒక మంచి పరిణామం.

భారత జట్టు సవాళ్లు

భారత పేస్ బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్‌కు సారథ్యం వహించినప్పటికీ, ఆమెకు మద్దతు ఇచ్చేవారు అనుభవంలో వెనుకబడి ఉన్నారు. క్రాంతి గౌడ్ (22 ఏళ్లు), అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్ వంటి పేసర్‌లకు కేవలం 25 వన్డేల కంటే తక్కువ అనుభవం ఉంది. ఇటీవల ఈ విభాగం తరచుగా 300కు పైగా పరుగులు సమర్పించుకుంది. అరుంధతి రెడ్డి వార్మప్ మ్యాచ్‌లో గాయంతో వీల్‌చైర్‌లో మైదానాన్ని వీడటం, అమన్‌జోత్ కౌర్ గాయాల భయం లాంటివి ఆందోళన కలిగించే విషయాలు. భారతదేశం ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ మానసిక ఒత్తిడి. కొన్ని కీలక పరిస్థితుల్లో జట్టు తరచుగా ఒత్తిడికి గురై మ్యాచ్‌లను కోల్పోయింది. టోర్నమెంట్ ప్రారంభంలో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే, స్పిన్నర్ల త్రయం ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాల్సి ఉంది.

మహిళల ప్రపంచ కప్‌లో భారత ప్రదర్శన

భారత మహిళల జట్టు 1976లో తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. 1978లో తొలిసారి మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ప్రారంభ ఎడిషన్లలో పెద్దగా ప్రభావం చూపకపోయినా 1997లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం వారి అత్యత్తమ ప్రదర్శనకు నిదర్శనం. భారత జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శనను 2005, 2017 ప్రపంచ కప్‌లలో నమోదు చేసింది. ఈ రెండు సందర్భాలలోనూ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది, కానీ వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల చేతిలో ఓడిపోయింది.

కాగా స్వదేశంలో జరిగే ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ కప్‌ను గెలుచుకునేందుకు గట్టి పోటీదారుల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఈసారి సొంతగడ్డపై ఆడుతున్న భారత జట్టు తమ సవాళ్లను అధిగమించి తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడుతుందో లేదో చూడాలి మరి.

భారత మహిళా జట్టు

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతీక రావల్, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్‌ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్‌ రాణా. స్టాండ్‌బై: సయాలీ సత్‌ఘరే, తేజల్‌ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.

మహిళల ప్రపంచ కప్ ఎక్కడ చూడాలి?

మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారి కోసం జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టీవీలో మ్యాచ్‌లను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

నేటి నుంచి మహిళల ప్రపంచకప్ - Tholi Paluku