Let's talk: editor@tmv.in
నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు

నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు

Shaik Mohammad Shaffee
24 జనవరి, 2026

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇది సామాన్య ప్రజలకు, ముఖ్యంగా నగదు లావాదేవీలు చేసే వ్యాపారవేత్తలకు కొంత ఇబ్బంది కలిగించే విషయం. ఈ సెలవుల వివరాలు చూస్తే జనవరి 24 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. మరుసటి రోజు ఆదివారం (జనవరి 25) కావడంతో సెలవు కొనసాగుతుంది. ఇక సోమవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినం. ఇలా మూడు రోజులు సెలవుల తర్వాత, మంగళవారం (జనవరి 27) నాడు సమ్మె కారణంగా బ్యాంకులు పనిచేయవు.

మంగళవారం సమ్మెకు పిలుపు

వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ప్రస్తుతం నెలలో కేవలం రెండు శనివారాలు మాత్రమే సెలవులు ఉండగా ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ తరహాలోనే తమకు కూడా అన్ని శనివారాలు సెలవు కావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని కోసం వారానికి ఐదు రోజులు, రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు కూడా తాము సిద్ధమని యూనియన్లు ప్రకటించాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో, 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' (యూఎఫ్‌బీయూ) సమ్మెను ఖరారు చేసింది.

ఆన్‌లైన్ సేవలు యథావిధిగా..

బ్యాంకులు భౌతికంగా మూతపడినప్పటికీ, కస్టమర్లకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. అయితే వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం వల్ల ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తమ అత్యవసర ఖర్చుల కోసం ముందే నగదును సిద్ధం చేసుకోవడం మంచిది. అలాగే చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు మంగళవారం వరకు నిలిచిపోతాయని గుర్తుంచుకోవాలి.

ప్రైవేట్ బ్యాంకులకు సమ్మె సెగ తక్కువే

ఈ సమ్మె ప్రభావం ప్రధానంగా ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులపైనే ఉండనుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా వంటి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథావిధిగా సాగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ బ్యాంకులతో ముడిపడి ఉన్న అంతర్-బ్యాంక్ లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌లో కొంత జాప్యం ఉండవచ్చు. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకింగ్ పనులను ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.