
నేటి నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' డిసెంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్ సమీపంలోని 'భారత్ ఫ్యూచర్ సిటీ' వేదికగా ప్రారంభం కానుంది.ఈ రెండు రోజుల సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొననున్నారు.
అధికారుల వివరాల ప్రకారం, ప్రారంభోత్సవ వేడుకకు నోబెల్ బహుమతిదారులు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్, బయోకాన్ అధిపతి కిరణ్ మజుందార్-షా వంటి అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వ్యక్తులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘తెలంగానా రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేయనుంది.
ఈ విజన్ డాక్యుమెంట్‌లో 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఇన్నోవేషన్ రంగాల విస్తరణపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా మార్చడమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.సమ్మిట్‌కు 42 దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు నమోదు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి దిశలో ప్రభుత్వం తీసుకునే వినూత్న చర్యలు, భవిష్యత్ అవకాశాలు, కీలకమైన రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను ఈ వేదికలో విస్తృతంగా ప్రదర్శించనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనికై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం నగర శివార్లలో ప్రతిపాదిత ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ స్థలంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సంబరాలలో భాగంగా, డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ సారథ్యంలో ఒక జట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మరో జట్టు మధ్య స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు రావచ్చని అంచనా.
ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మెస్సీ వంటి గ్లోబల్ ఐకాన్‌కు అంతర్జాతీయ ప్రమాణాల భద్రత అవసరమవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాచకొండ హైదరాబాద్ పోలీసు కమిషనర్లు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.
సమ్మిట్ ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉండాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి దిశను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టెలంగానా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
సంస్కృతి, భద్రతపై సూచనలు
సమ్మిట్ జరుగనున్న మీర్‌ఖాన్‌పేట్ ప్రాంతంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను సీఎం రేవంత్ స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్‌లో పై నుంచి మొత్తం స్థలాన్ని పరిశీలించిన అనంతరం వేదిక ప్రాంగణాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను ఒక్కొటిగా ఆరా తీశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో ఏ చిన్న లోపం చోటుచేసుకోకూడదని ఆయన ఆదేశించారు.
సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రదర్శనలను పరిశీలించి, అవసరమైన మార్పులపై సూచనలు చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు స్వాగతం, వసతి, రవాణా, ఆతిథ్య కార్యక్రమాల నిర్వహణలో అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే స్థానిక రుచులతో కూడిన ఆతిథ్య భోజన వసతులు అందించేందుకు సంబంధిత అధికారులను దిశానిర్దేశం చేశారు.
ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, ఫైరుసేఫ్టీ చర్యలు, అత్యవసర సేవల ప్లాన్ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకుని సూచనలు చేశారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పతాక కాంతులతో వెలిగిన సచివాలయం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం సందర్భంగా, సచివాలయం భవనాన్ని జాతీయ పతాక కాంతులతో అద్భుతంగా అలంకరించారు.త్రివర్ణ వర్ణాలలో ప్రకాశిస్తున్న సచివాలయం... రాష్ట్ర ప్రజల అభిమానానికి, సాధించిన అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. ఈ శోభాయమాన దృశ్యం చూపరులను విశేషంగా ఆకర్షిస్తూ, సమ్మిట్ ప్రాధాన్యతను చాటుతోంది.
