Let's talk: editor@tmv.in
నేటి నుంచి జనవరి 31వరకు హైదరాబాద్‌లో ‘జీహెచ్‌ఎంసీ మెగా శానిటేషన్ డ్రైవ్’

నేటి నుంచి జనవరి 31వరకు హైదరాబాద్‌లో ‘జీహెచ్‌ఎంసీ మెగా శానిటేషన్ డ్రైవ్’

Gaddamidi Naveen
29 డిసెంబర్, 2025

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుస్థిరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది.నేటి నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం, వార్డు డీలిమిటేషన్ అనంతరం 300 వార్డులను కవర్ చేస్తూ చేపట్టే తొలి విస్తృత స్థాయి డ్రైవ్‌గా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా నగరవ్యాప్తంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత వ్యర్థాలను తొలగింపు, అలాగే నిర్మాణ రంగ వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తారు. అలాగే ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు, సరస్సులు, నాలాలు, పార్కులు, ఫుట్‌పాత్‌లు శుభ్రం చేయనున్నారు. నగర అందాన్ని మెరుగుపరిచేలా శుభ్రపరిచిన ప్రాంతాల్లో సౌందర్యీకరణ పనులు కూడా నిర్వహించనున్నారు.

పారిశుధ్య నిబంధనలను ఉల్లంఘించే వారిపై స్పాట్ ఫైన్లు విధించడం ద్వారా ప్రజల్లో బాధ్యతాభావం పెంచే చర్యలు తీసుకుంటారు. ఇక శుభ్రం చేసిన గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను ‘సెల్ఫీ పాయింట్లు’గా మార్చి, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నది జీహెచ్ఎంసీ యోచన. ఈ మెగా డ్రైవ్‌లో పౌరుల భాగస్వామ్యం కీలకం అని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా, వేరు వేరు రకాలుగా వేరు చేసి ఇవ్వడం, నిబంధనలను పాటించడం ద్వారా ప్రతి పౌరుడు ఈ కార్యక్రమానికి తోడ్పడాలని కోరుతున్నారు. ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ద్వారా హైదరాబాద్‌ను మరింత శుభ్రంగా, ఆరోగ్యకరంగా, సుస్థిర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.