
నేటి నుంచి ఆసియా బాక్సింగ్ సమరం
ఆసియా బాక్సింగ్ వేదికపై భారత బాక్సర్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో నేటి నుంచి ఏప్రిల్ 11 వరకు జరిగే ‘ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2026’లో భారత్ తరఫున 20 మంది సభ్యులతో కూడిన శక్తివంతమైన జట్టు బరిలోకి దిగుతోంది. ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ భారత్‌కు నాయకత్వం వహిస్తున్నారు. సుమారు 250 మంది అగ్రశ్రేణి బాక్సర్లు తలపడే ఈ మెగా టోర్నీలో భారత బాక్సర్లు పతకాలే లక్ష్యంగా నేడు రింగ్‌లోకి దిగనున్నారు.
ఒలింపియన్ల జోరు.. పతకాలే గురి
మహిళల విభాగంలో ఇటీవల స్పెయిన్‌లో పసిడి పతకం సాధించిన లవ్లీనా (75 కేజీలు), ఆసియా కాంస్య విజేత నిఖత్ జరీన్ (51 కేజీలు) ఈసారి పతకాలు గెలిచే ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు ప్రపంచ ఛాంపియన్లు మీనాక్షి హుడా, జాస్మిన్ లంబోరియా, ఒలింపియన్ పూజా రాణి రాకతో భారత మహిళల జట్టు మరింత బలోపేతమైంది. పురుషుల జట్టుకు వరల్డ్ బాక్సింగ్ కప్ విజేత సచిన్ సివాచ్ (60 కేజీలు) నాయకత్వం వహిస్తుండగా.. ఫామ్ సరిగ్గా లేకపోవడంతో అమిత్ పంగల్, హుస్సాముద్దీన్, నీతూ గంగాస్ వంటి ప్రముఖ బాక్సర్లకు ఈసారి జట్టులో చోటు దక్కలేదు.
నేరుగా అర్హత సాధించే అవకాశం
ఈ టోర్నీ భారత బాక్సర్లకు అత్యంత కీలకం. ఆమోదించబడిన వెయిట్ కేటగిరీలలో ఫైనల్స్‌కు చేరుకున్న బాక్సర్లు రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. దీంతో బాక్సర్లు పతకాలతో పాటు ఆయా క్రీడలకు అర్హత దిశగా కూడా పట్టుదలగా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ప్రిలిమినరీ రౌండ్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న మహిళల ఫైనల్స్, ఏప్రిల్ 10న పురుషుల ఫైనల్స్ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ పోటీలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. అయితే క్రీడాభిమానులు 'ఆసియా బాక్సింగ్' అధికారిక వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
భారత జట్ల వివరాలు ఇవే!
మహిళలు:
మీనాక్షి హుడా (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జాస్మిన్ లంబోరియా (57 కేజీలు), ప్రియ (60 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు), లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), అల్ఫియా పఠాన్ (80+ కేజీలు).
పురుషులు:
విశ్వనాథ్ సురేష్ (50 కేజీలు), జడుమణి సింగ్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), ఆదిత్య ప్రతాప్ యాదవ్ (65 కేజీలు), దీపక్ (70 కేజీలు), ఆకాష్ (75 కేజీలు), అంకుష్ (80 కేజీలు), లోకేష్ (85 కేజీలు), హర్ష్ చౌదరి (90 కేజీలు), నరేందర్ బెర్వాల్ (90+ కేజీలు).
