Let's talk: editor@tmv.in
నెహ్రూ బాబ్రీ మసీదుకు ప్రభుత్వ నిధులు వాడకుండా పటేల్ ఆపారు: రాజ్‌నాథ్ సింగ్

నెహ్రూ బాబ్రీ మసీదుకు ప్రభుత్వ నిధులు వాడకుండా పటేల్ ఆపారు: రాజ్‌నాథ్ సింగ్

Shaik Mohammad Shaffee
3 డిసెంబర్, 2025

భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ల మధ్య ఉన్న విభేదాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని వడోదర సమీపంలో జరిగిన 'ఐక్యతా యాత్ర'లో పాల్గొన్న ఆయన, నెహ్రూకు వ్యతిరేకంగా పటేల్ ఏ విధంగా నిలబడ్డారో వివరించారు.

నెహ్రూ ప్రతిపాదనను అడ్డుకున్న పటేల్

నెహ్రూ ఒకప్పుడు బాబ్రీ మసీదు నిర్మాణానికి ప్రభుత్వ నిధులను వాడాలని అనుకున్నారని, అయితే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆ ప్రతిపాదనను బలంగా వ్యతిరేకించి, ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ గురించి నెహ్రూ ప్రస్తావించినప్పుడు, పటేల్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణకు కావలసిన రూ.30 లక్షల మొత్తం సామాన్య ప్రజల విరాళాల నుంచి వచ్చాయని, ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని పటేల్ చెప్పారన్నారు. అదే విధంగా అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే మొత్తం ఖర్చు భరించారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇదే నిజమైన సెక్యులరిజం (లౌకికవాదం) అని ఆయన అన్నారు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా, ఆయన పదవుల కోసం ఎప్పుడూ ఆరాటపడలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మహాత్మా గాంధీకి ఇచ్చిన మాట కోసం, నెహ్రూతో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, ఆయనతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. 1946లో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల సమయంలో, మెజారిటీ కాంగ్రెస్ సభ్యులు పటేల్ పేరును ప్రతిపాదించినా, గాంధీ కోరిక మేరకు పటేల్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకొని నెహ్రూ ప్రెసిడెంట్ అవ్వడానికి అవకాశం కల్పించారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

మెమోరియల్ ఫండ్స్‌పై నెహ్రూ వైఖరి

సర్దార్ పటేల్ మరణానంతరం, ఆయన కోసం స్మారక చిహ్నం నిర్మించడానికి సామాన్య ప్రజలు డబ్బులు పోగు చేస్తే, ఆ సమాచారం నెహ్రూకు చేరినప్పుడు ఆయన ఒక అసంబద్ధమైన సూచన చేశారని రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. "పటేల్ రైతు నాయకుడు కాబట్టి, ఆ డబ్బును గ్రామాల్లో బావులు, రోడ్లు నిర్మించడానికి ఉపయోగించాలి" అని నెహ్రూ సూచించారట. బావులు, రోడ్లు నిర్మించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని, స్మారక చిహ్నం కోసం పోగు చేసిన నిధులను దాని కోసం వాడాలనడం ఎంతటి అపహాస్యం! అని సింగ్ ప్రశ్నించారు. ఆ నాటి ప్రభుత్వం పటేల్ గొప్ప వారసత్వాన్ని అణచివేయాలని ప్రయత్నించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

'భారతరత్న' ఎందుకు ఇవ్వలేదు?

నెహ్రూ తనకు తానే భారతరత్న ఇచ్చుకున్నారు అని ఆరోపించిన రాజ్‌నాథ్ సింగ్, మరి అదే సమయంలో సర్దార్ పటేల్‌కు ఆ గౌరవాన్ని ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించారు. పటేల్ వారసత్వాన్ని చెరిపేయాలని కొందరు ప్రయత్నించారని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ వాటిని తిప్పి కొట్టి, 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' (ఐక్యతా విగ్రహం) నిర్మించడం ద్వారా పటేల్‌కు సరైన గౌరవాన్ని ఇచ్చారని కొనియాడారు.

కాశ్మీర్, హైదరాబాద్ విలీనం

కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడుతూ, కాశ్మీర్ విలీనం సమయంలో పటేల్ చెప్పిన మాటలు విని ఉంటే, భారత్ ఇన్నేళ్ల పాటు ఈ సమస్యతో పోరాడాల్సిన అవసరం వచ్చేది కాదని సింగ్ అన్నారు. అదేవిధంగా, హైదరాబాద్ విలీనం సమయంలో పటేల్ గట్టి వైఖరి తీసుకోకపోయి ఉంటే, బహుశా హైదరాబాద్ ఈరోజు భారతదేశంలో భాగమయ్యేది కాదని గుర్తు చేశారు. అంటే శాంతి చర్చలు విఫలమైనప్పుడు, కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి పటేల్ వెనుకాడలేదని సింగ్ స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా ఈ విలువనే పాటిస్తోందని, 'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా శాంతిని పలకని వారికి ధీటైన జవాబివ్వగలమని ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం చిన్న విషయం కాదని, మోడీ ఆ నిర్ణయం తీసుకొని కాశ్మీర్‌ను భారతదేశంతో పూర్తిగా కలిపారని ఆయన ప్రశంసించారు.