
నెహ్రూ పత్రాలు మాయం కాలేదు.. సోనియా గాంధీ వద్దే ఉన్నాయి: కేంద్రం
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక పత్రాలను కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తన వద్దే ఉంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇవి వ్యక్తిగత ఆస్తులు కావని, ప్రజా ఆర్కైవ్స్‌లో ఉండాల్సిన జాతీయ సంపద అని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. 2008లో సోనియా గాంధీ అభ్యర్థన మేరకు నెహ్రూకు సంబంధించిన 51 పెట్టెల పత్రాలను అప్పటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ నుంచి అధికారికంగా ఆమెకు అప్పగించారు. అయితే ఈ పత్రాలు మాయమవలేదని, అవి ఎక్కడ ఉన్నాయో ప్రభుత్వానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. "ఒక వస్తువు ఎక్కడుందో తెలియనప్పుడే దానిని 'మాయమైంది' అంటాం. కానీ ఈ పత్రాలు సోనియా గాంధీ వద్దే ఉన్నాయని అందరికీ తెలుసు, కాబట్టి ఇవి 'మిస్సింగ్' కావు" అని షెకావత్ స్పష్టం చేశారు.
పరిశోధకులకు, ప్రజలకు ఈ పత్రాలు ఎంతో అవసరం
నెహ్రూ పత్రాలు దేశ చరిత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆధారాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పత్రాలు అందుబాటులో ఉంటేనే పరిశోధకులు, విద్యార్థులు, చరిత్రకారులు, పార్లమెంట్ సభ్యులు నాటి చరిత్రను నిష్పక్షపాతంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి షెకావత్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాల తీరును విమర్శిస్తూ.. “నెహ్రూ కాలంలో జరిగిన తప్పిదాలపై చర్చ చేయవద్దని ఒకవైపు చెబుతూనే, మరోవైపు ఆ కాలానికి సంబంధించిన అసలు ఆధారాలను ప్రజలకు అందుబాటులో లేకుండా దాచిపెట్టడం సరైంది కాదు” అని మండిపడ్డారు.
పత్రాలను ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు?
నెహ్రూ పత్రాలను తిరిగి అప్పగించాలని కోరుతూ 'ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్) ఇప్పటికే 2025 జనవరి, జూలై నెలల్లో సోనియా గాంధీకి లేఖలు రాసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇన్ని సార్లు కోరినప్పటికీ ఇప్పటి వరకు ఆ పత్రాలను తిరిగి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. "దేశ ప్రజలకు సమాధానం కావాలి. ఈ కీలక పత్రాలను ఇంకా ఎందుకు బయటే ఉంచుతున్నారు? అసలు వీటిలో ఏం దాస్తున్నారు?" అని కేంద్రమంత్రి షెకావత్ నిలదీశారు.
ఇవి వ్యక్తిగత పత్రాలు కావు: కేంద్రం
ఈ వివాదంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మరింత స్పష్టతనిస్తూ.. "ఈ పత్రాలు నెహ్రూ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత పత్రాలు కావు. ఇవి భారతదేశపు తొలి ప్రధానమంత్రికి సంబంధించినవి, అంటే ఇవి దేశ చరిత్రలో అంతర్భాగం. కాబట్టి ఇవి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆర్కైవ్స్‌లోనే ఉండాలి" అని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ విమర్శలకు షెకావత్ కౌంటర్
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ చేసిన విమర్శలకు మంత్రి షెకావత్ ఘాటుగా స్పందించారు. "లోక్‌సభలో మేము చెప్పిన సమాచారం చాలా స్పష్టంగా, రికార్డుల్లో ఉంది. 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే, ప్రభుత్వ సంస్థలను తమ సొంత ఆస్తుల్లా భావించిన సమయంలో ఈ పత్రాలను బయటకు తీసుకెళ్లారు. ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయని సోనియా గాంధీ స్వయంగా రాతపూర్వకంగా అంగీకరించారు" అని షెకావత్ గుర్తు చేశారు.
పీఎంఎంఎల్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది?
ప్రస్తుతం 'ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ' సొసైటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంస్థే దేశ ప్రధానులకు సంబంధించిన రికార్డుల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
నెహ్రూ పత్రాల వ్యవహారం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. "ఈ రికార్డులు ఒక కుటుంబానికి సంబంధించినవి కావు.. ఇవి జాతీయ సంపద, ఇవి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి" అని కేంద్రం తెగేసి చెబుతోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఈ పత్రాలను ఎప్పుడు తిరిగి అప్పగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
