Let's talk: editor@tmv.in
నెహ్రూ చరిత్రను వక్రీకరిస్తున్నారు: సోనియాగాంధీ

నెహ్రూ చరిత్రను వక్రీకరిస్తున్నారు: సోనియాగాంధీ

Pinjari Chand
7 డిసెంబర్, 2025

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వాన్ని అపహస్యం చేయడానికి, ఆయన చరిత్రాత్మక పాత్రను దెబ్బతీయడానికి వ్యవస్థాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మండిపడ్డారు.

ఢిల్లీలోని జవహర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘నెహ్రూ సెంటర్ ఇండియా’ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె ప్రస్తుత పాలక వ్యవస్థ లక్ష్యం నెహ్రూను చరిత్ర నుంచి తొలగించడం మాత్రమే కాకుండా, భారత రాజ్యవ్యవస్థ, ఆర్థిక–సామాజిక మూల స్తంభాలను ధ్వంసం చేయడమేనని వ్యాఖ్యానించారు. నెహ్రూ పై తప్పుడు ప్రచారం చేయడం, ఆయనను దూషించడం, ఇవన్నీ పాలక పక్షం ప్రధాన ప్రాజెక్ట్‌గా మారాయి. ఇది చరిత్రను తిరగరాయడం, దేశానికి పునాది వేసిన విలువలను ధ్వంసం చేయడమేనని సోనియా గాంధీ అన్నారు. నెహ్రూ కృషిపై పరిశీలన, చర్చలు రావడం స్వాగతించదగినదేనని, కానీ అవగాహనతో చేసిన విమర్శలు, కావాలనే వక్రీకరించిన విషప్రచారం మధ్య తేడా గుర్తించాలి అని ఆమె అన్నారు.

చరిత్రను మార్చాలని చూస్తున్నారు

నెహ్రూ రచనలపై విశ్లేషణను స్వాగతిస్తున్నామని, కానీ ఆయనను కించపరచడం, వక్రీకరించడం, అవమానించడం ఆమోదయోగ్యం కాదని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఇది కేవలం నెహ్రూను వ్యక్తిగతంగా తగ్గించడం మాత్రమే కాదు, స్వాతంత్ర్య సమరంలో ఆయన పాత్రను, స్వతంత్ర భారతాన్ని నడిపించిన తొలి దశాబ్దాలను కూడా చిన్నదిగా చేయడమే. ఇది చరిత్రను తిరిగి రాయాలన్న స్వయం సేవా ప్రయత్నం అని ఆమె ఆరోపించారు. ఈ ప్రయత్నాలను భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని వ్యతిరేకించిన భావజాలంతో ముడిపెట్టిన సోనియా ఈ శక్తులు స్వాతంత్ర్య పోరాటంలో ఎటువంటి పాత్ర పోషించలేదు. రాజ్యాంగాన్ని తగులబెట్టాయి, పూర్తిగా వ్యతిరేకించాయి. స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా ఉన్నవారే నేడు చరిత్రను మార్చాలని చూస్తున్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, రాజ్యాంగ రూపకల్పనలో పాత్ర లేనివారే నేడు చరిత్రను విచ్ఛిన్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా బీజేపీపై ఆమె విమర్ళలు చేశారు. ఇదే భావజాలం మతోన్మాద, క్రూరమైన మతతత్వ దృక్పథంతో నడిచి మహాత్మా గాంధీ హత్యకు కారణమైంది. ఆ హంతకులను ఇప్పటికీ ఈ భావజాలం ఉన్న అనుచరులు కీర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ నిర్మాణంలో ఋణపడి ఉన్న విలువలకు తూట్లు పొడుస్తూ, పగ, మత విద్వేషాలను ప్రోత్సహిస్తూ దేశాన్ని మళ్లీ వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆమె తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దురుద్దేశ ప్రాజెక్ట్ ను అడ్డుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సోనియా పిలుపునిచ్చారు. మనకు, మన తరాలకు, నెహ్రూ వంటి మహానుభావులకు ఇచ్చిన ఋణం తీర్చుకోవాలంటే ఈ కుట్రకు ఎదురు నిలవాలి. వెనుకడుగు వేయలేం అని సోనియా గాంధీ స్పష్టం చేశారు.