
నెహ్రూపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ప్రజల సొమ్ముతో (ప్రభుత్వ నిధులతో) బాబ్రీ మసీదును నిర్మించాలని నెహ్రూ అనుకున్నారని, అయితే గుజరాత్ కు చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని అడ్డుకున్నారని రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అధికార బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని ఆరోపించారు.
రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే?
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని వడోదర సమీపంలో జరిగిన 'యూనిటీ మార్చ్' సభలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ నిధులతో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించాలని కోరుకున్నారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రభుత్వ నిధులతో బాబ్రీ మసీదు నిర్మించడానికి ఆయన అంగీకరించలేదు" అని రాజ్‌నాథ్ అన్నారు. అయోధ్యలోని రామమందిరం కూడా ప్రభుత్వ నిధులు లేకుండా ప్రజల విరాళాలతోనే నిర్మాణం జరిగిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విపక్షాల ప్రతిస్పందన ఇదే!
విపక్ష నాయకులు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ "ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలే. చర్చించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా ఉండేందుకు వారు ప్రతిరోజూ ఇలాంటి కొత్త అంశాలను తీసుకొస్తున్నారు" అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ, రక్షణ మంత్రి తన కథనానికి సరిపోయేలా చరిత్రను వక్రీకరించడం మానేసి వ్యూహాత్మక సవాళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ, రాజ్‌నాథ్ సింగ్ లాంటి అనుభజ్ఞుడైన నాయకుడు, రక్షణ మంత్రిగా సైన్యానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. "బీజేపీ చారిత్రక వాస్తవాలను ఎలా ప్రదర్శిస్తుందో దేశం మొత్తం అర్థం చేసుకుంది" అని విమర్శించారు. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన ఫౌజియా ఖాన్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. "రాజ్‌నాథ్ సింగ్ చాలా బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయనకు తగవు. ఆయన చెప్పినదానికి ఆధారాలు చూపించాలి, లేదంటే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. ఇది చాలా సిగ్గుచేటు" అని ఆజాద్ అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ, "పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి మాట్లాడేటప్పుడు, దానికి సంబంధించిన చారిత్రక పత్రాలను వారు చూపించాలి. కేవలం ఆయన చెబితే ఎవరూ అంగీకరించరు" అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ మాట్లాడుతూ "రాజ్‌నాథ్ సింగ్ అయినా, ప్రధాని అయినా, మొత్తం బీజేపీ అయినా.. వారి పని పాత సమస్యలను తవ్వి తీయడం, గత వివాదాలను తిరిగి లేవనెత్తడమే. నెహ్రూ ఇవాళ బతికి లేరు, వారికి సమాధానం చెప్పడానికి. వారు కావాలనే చరిత్ర పుటల నుండి ఇలాంటి అంశాలను తీసి, ఆరోపణలు చేస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
