
నెహ్రూను ఎప్పుడూ విమర్శించే వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు: ప్రియాంక గాంధీ
లోక్‌సభ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించే తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి కిరెన్‌రిజిజు పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రును విమర్శించే వారు ఇప్పుడు తమ వాదనలకు ఆయన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లాను తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో రిజిజు మాట్లాడారు. 1954లో అప్పటి స్పీకర్ జీవీ.మావలంకర్ ను తొలగించే తీర్మానంపై జరిగిన చర్చలో నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. ఆ సమయంలో నెహ్రూ మాట్లాడుతూ ఈ తీర్మానంపై సంతకం చేసిన సభ్యులు దానిని పూర్తిగా చదివారా అన్న అనుమానం ఉంది. చదివి ఉంటే వారు వందసార్లు ఆలోచించి ఉండేవారు అని పేర్కొన్నారని రిజిజు చెప్పారు.
ఇదే సమయంలో రిజిజు కాంగ్రెస్‌పై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ బదులు ప్రియాంక గాంధీని నియమించి ఉంటే ప్రతిపక్షం ప్రదర్శన మెరుగ్గా ఉండేదని అన్నారు. ప్రియాంక గాంధీ అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఆమెను ప్రతిపక్ష నేతగా చేసుంటే పరిస్థితి బాగుండేది. కనీసం ఆమె సభలో కూర్చొని వినడం, నవ్వడం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రిజిజు వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, తాను నవ్విన కారణం అదే అని చెప్పారు. నన్ను ఎందుకు నవ్వుతున్నావని అడిగారు. రోజూ నెహ్రూను విమర్శించే వారు ఇప్పుడు తమ వాదన కోసం నెహ్రూ వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. అందుకే నేను నవ్వాను అని ఆమె చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం ముందు తలవంచని వ్యక్తి ఒకరే ఉన్నారని, అతనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎలాంటి సంకోచం లేకుండా నిజాలు చెబుతున్నారని, అధికార పక్ష సభ్యులు ఆ నిజాలను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం చేసుకుని తలవంచిందని ఆరోపించారు. దేశంలోని సంస్థలను బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, వాటిని కాపాడేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని అన్నారు. స్పీకర్‌పై తీర్మానం తీసుకురావడానికి కారణం కూడా ఇదేనని, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి స్పీకర్ స్వతంత్రతను దెబ్బతీసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వం ఇతర అంశాలను ప్రస్తావిస్తూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు.
