Let's talk: editor@tmv.in
నెల్లూరు జిల్లాలో విషాదం.. బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతు

నెల్లూరు జిల్లాలో విషాదం.. బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతు

Shaik Mohammad Shaffee
17 జనవరి, 2026

సంక్రాంతి వేడుకల వేళ నెల్లూరు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అల్లూరు మండలం ఇసకపల్లి సముద్ర తీరంలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పండుగ ఆనందంలో ఉన్న ఆ కుటుంబాల్లో ఈ ఘటన తీరని శోకాన్ని నింపింది.

బంధువుల ఇంటికి వచ్చి.. అంతలోనే..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గల్లంతైన విద్యార్థులందరూ అల్లూరు మండలంలోని గొల్లపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందినవారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా వీరంతా అల్లూరు పంచాయతీ పరిధిలోని ఎర్రపాగుంట గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వచ్చారు. కనుమ పండుగ రోజు కావడంతో సరదాగా గడిపేందుకు సమీపంలోని ఇసకపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో కేరింతలు కొడుతూ నీటిలోకి దిగిన విద్యార్థులు, సముద్రపు పోటు ఉధృతంగా ఉండటంతో ఒక్కసారిగా వచ్చిన అలల ధాటికి గల్లంతయ్యారు.

రంగంలోకి మెరైన్ పోలీసులు, మత్స్యకారులు

సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, అల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు తమ పడవలతో సముద్రంలోకి వెళ్లి గాలించగా, ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు తీరానికి దొరికాయి.

బాధితుల వివరాలు

ఈ విషాద ఘటనలో గల్లంతైన విద్యార్థులను పోలీసులు గుర్తించారు. వీరిలో బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన ఈగ అమ్ములు (14) తొమ్మిదో తరగతి చదువుతుండగా, ఆమె సోదరుడు ఈగ బాలకృష్ణ (15) ఇంటర్మీడియట్ విద్యార్థి. అలాగే, ఇసకపల్లి బి.ఎం.ఆర్ కాలనీకి చెందిన అభిషేక్ (16), చేజర్లకు చెందిన గంధళ్ల సుధీర్ (15) కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు.

లభ్యమైన మృతదేహాల్లో ఈగ అమ్ములు, ఈగ బాలకృష్ణ ఉన్నారు. వీరు వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిగిలిన ఇద్దరు విద్యార్థులు అభిషేక్, సుధీర్ ల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పాపారావు తెలిపారు.

గ్రామంలో విషాద ఛాయలు

పండుగ పూట గల్లంతైన విద్యార్థుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. చీకటి పడినా మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఆగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.