
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలు, తుఫాను వాతావరణం కారణంగా అధికారులు ముందస్తు చర్యలను తీసుకోవాలని నెల్లూరుజిల్లాకలెక్టర్ ఆదేశాలుజారీ చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వివిధ శాఖలకు పూర్తి అప్రమత్తత, నిర్దిష్ట సూచనలు జారీ చేశారు. వర్షాల వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి రెవెన్యూ, పోలీస్ విభాగాల సిబ్బంది పూర్తి అప్రమత్తతతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా అంతటా భారీ వర్షాలు, తుఫాను వాతావరణం కారణంగా, అక్టోబర్ 22 బుధవారం నాడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
నెల్లూరులో అల్పపీడనం కారణంగా అక్టోబర్ 22, 2025న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుల వైపు కదులుతోంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు (అక్టోబర్ 23, 2025) నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నెల్లూరు జిల్లాలో సగటున 60.8 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ముందు జాగ్రత్త చర్యగా తక్షణమే తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను కూడా తీసుకోమని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం నుండి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తీర ప్రాంత నివాసితులు , మత్స్యకారులను అప్రమత్తం చేయాలని, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని గట్టిగాహెచ్చరించారు. ఇది ఇలా ఉండగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ అక్టోబర్ 25 వరకు పనిచేస్తుంది. వర్షాల సంబంధిత సమస్యల కోసం పౌరులు 0861-2331261 లేదా 7995576699 నంబర్లను సంప్రదించవచ్చు.
ఈ భారీ వర్షాలు తీర ప్రాంతాల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు మరియు డెల్టా జిల్లాలలో భారీ వర్షాలను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని , వరి కొనుగోలు కార్యకలాపాలను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.
చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని వాతావరణ వ్యవస్థల కారణంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
