Let's talk: editor@tmv.in
నెల్లూరు జిల్లాలో అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌కు నేడు శంకుస్థాపన

నెల్లూరు జిల్లాలో అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌కు నేడు శంకుస్థాపన

Dantu Vijaya Lakshmi Prasanna
12 మార్చి, 2026

భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర సాంకేతిక రంగంలో కీలక పురోగతికి దోహదపడే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టబోతున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటుకు నేడు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఆధునిక కేంద్రాన్ని అభివృద్ధి చేయనుంది. భారతదేశ సముద్ర రక్షణ తయారీ రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అత్యాధునిక సముద్ర సాంకేతికతను ప్రోత్సహించడమే కాకుండా మత్స్యరంగ అభివృద్ధి, తీర ప్రాంత భద్రత బలోపేతానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది.

జువ్వలదిన్నె తీర ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి గల మారిటైం పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. తీర ప్రాంత నిఘా వ్యవస్థను మెరుగుపరచడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటి అంశాలకు కూడా ఈ కేంద్రం సహకరించనుంది.

మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి

ఈ అటానమస్ మారిటైం షిప్ యార్డ్ మరియు సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటుకు మొదటి దశలో సుమారు రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రాజెక్ట్ అమలుతో 750 మందికిపైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద 29.58 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ భూమి కూడా ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తయ్యాక 2026 నవంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ఈ కేంద్రంలో షిప్ బిల్డింగ్, అటానమస్ సిస్టమ్స్ అభివృద్ధి, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి వంటి రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మారిటైం రోబోటిక్స్, స్మార్ట్ సెన్సార్ టెక్నాలజీలు, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మానవ రహిత సముద్ర ఉపరితల వాహనాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సంస్థ భారత నౌకాదళం, ఇన్నొవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్లెన్స్, ఇతర భద్రతా సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

ఈ అటానమస్ మారిటైం షిప్ యార్డ్ అత్యాధునిక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇందులో మానవ రహిత ఉపరితల నౌకలు, నీటి అడుగున పనిచేసే యంత్ర నౌకల నిర్మాణం, వాటి పరీక్షలు, నిర్వహణ, లైఫ్ సైకిల్ సపోర్ట్ వంటి కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ అమలుతో బ్లూ ఎకానమీ, మారిటైం ఇన్నోవేషన్ రంగాలు బలోపేతం కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడినట్లు ప్రభుత్వం పేర్కొంది.