
నెల్లూరులో రూ.6,675 కోట్లతో టాటా పవర్ ప్లాంట్
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి మరో ముందడుగు పడింది. ప్రముఖ సంస్థ 'టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్' నెల్లూరు జిల్లాలో భారీ సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ. 6,675 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రంగా నిలవనుంది.
ప్రాజెక్టు ప్రత్యేకతలు
ఈ తయారీ కేంద్రాన్ని నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ ప్లాంట్ సామర్థ్యం 10 గిగావాట్లుగా ఉంటుంది. దీనిని రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు. మొదటి దశ కోసం 120 ఎకరాలు, భవిష్యత్ విస్తరణ కోసం మరో 80 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ తయారయ్యే 'ఇంగాట్’, 'వేఫర్లు' సోలార్ సెల్స్, ప్యానెల్స్ తయారీకి అత్యంత కీలకం. ఇప్పటివరకు వీటి కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడుతుండగా, ఈ ప్లాంట్ రాకతో స్వదేశీ తయారీ రంగం మరింత బలోపేతం కానుంది.
ఉపాధి, గ్రీన్ ఎనర్జీ
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా నిర్మాణ సమయంలో, అనుబంధ రంగాల ద్వారా వేల సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. పర్యావరణ హితానికి ప్రాధాన్యం ఇస్తూ, ఈ తయారీ కేంద్రానికి అవసరమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు టాటా పవర్ సంస్థ అక్కడే 200 మెగావాట్ల సొంత గ్రీన్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.
నెల్లూరు.. సోలార్ హబ్
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన భూమి అందుబాటులో ఉండటం, రవాణాకు అనువైన రోడ్లు, ఓడరేవు (పోర్టు) సౌకర్యాలు, కరెంటు కష్టాలు లేకపోవడం వల్లే టాటా పవర్ వంటి పెద్ద కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా సోలార్ ప్యానెల్స్ తయారీకి పేరుగాంచుతోంది. ఇప్పుడు వస్తున్న ఈ భారీ ప్రాజెక్టుతో నెల్లూరు జిల్లా స్థాయి మరింత పెరగడమే కాకుండా, ఈ ప్రాంతం దేశంలోనే ఒక పెద్ద తయారీ కేంద్రంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
పెట్టుబడిని స్వాగతించిన మంత్రి లోకేష్
ఈ భారీ పెట్టుబడిని స్వాగతించిన రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కాలుష్య రహిత స్వచ్ఛ ఇంధన తయారీకి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్లే టాటా వంటి పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు రాకతో రాష్ట్ర ప్రతిష్ట పెరగడమే కాకుండా, పారిశ్రామికంగా ఏపీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు మంచి వేతనంతో కూడిన నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సౌర విద్యుత్ రంగంలో భారతదేశం సొంతంగా ఎదిగేందుకు, విదేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దేశం మొత్తం ఇప్పుడు పర్యావరణ హితమైన ఇంధనం వైపు మళ్లుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ఈ మార్పులో కీలక పాత్ర పోషించబోతోందని ఆయన వివరించారు.
