
నెల్లూరులో "మట్టి పొరల నుంచి మళ్ళీ పుట్టిన మహేశ్వరుడు”
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో ఇసుక తిన్నెల కింద పది శతాబ్దాలుగా నిక్షిప్తమై ఉన్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం పునరుద్ధరణ పనులతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం తిరిగి ప్రాణం పోసుకుంటోంది. స్థానిక యువత చొరవ, ప్రభుత్వ సహకారంతో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం మళ్లీ వెలుగుచూసింది. ఈ అద్భుత ఘట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పురాణ నేపథ్యం: పరశురాముడి ప్రతిష్ఠ
ఈ ఆలయానికి అత్యంత పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించిన పరశురాముడు, మాతృహత్య పాప పరిహారం కోసం దేశవ్యాప్తంగా శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగానే పెన్నానది తీరాన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానిక కథనం. ఇక్కడ స్వామివారు నాగేశ్వరస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నారు.
200 ఏళ్లుగా ఇసుకలో
సుమారు 10 శతాబ్దాల క్రితం రాజులు నిర్మించిన ఈ అద్భుత కట్టడం ప్రకృతి వైపరీత్యాల వల్ల భూస్థాపితమైంది. పెన్నానది ఈ ప్రాంతంలో హఠాత్తుగా (నది దిశ మార్పు చెంది) ఈశాన్య దిశగా మళ్లడం వల్ల భౌగోళిక మార్పులు సంభవించాయి.ఇసుక తుపాన్లు కారణంగా పడమటి గాలుల తీవ్రతకు నదిలోని ఇసుక కొట్టుకువచ్చి ఆలయంపై మేటలు వేసింది.
200 ఏళ్ల క్రితం పెరిగిన ఇసుక మేటల వల్ల పాత గ్రామం నివాసయోగ్యం కాకుండా పోయింది. దీంతో అప్పట్లో గ్రామస్థులు ఆ ప్రాంతాన్ని విడిచి, నదికి దక్షిణంగా కిలోమీటర్ దూరంలో కొత్తగా 'పెరుమాళ్లపాడు' గ్రామాన్ని నిర్మించుకున్నారు.
ఈ ఆలయానికి వందల ఎకరాల మాన్యాలు ఉన్నప్పటికీ, కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరి భూస్థాపితమైపోయింది. అయితే, కరోనా లాక్‌డౌన్ సమయంలో నగరాల నుంచి గ్రామాలకు తిరిగి వచ్చిన స్థానిక యువత, తమ ప్రాంత చరిత్రను కాపాడుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. యంత్రాల సాయంతో తవ్వకాలు జరిపి ఆలయ ఆనవాళ్లను గుర్తించారు. ఆలయ మాన్యాల ద్వారా వచ్చే రాబడి దేవాదాయ శాఖ వద్దే ఉండటంతో, అదే నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.
ప్రభుత్వ స్పందన. క్షేత్రస్థాయి పరిశీలన
గాలుల కారణంగా ఇసుకతో పెన్నానది గర్భంలో కలిసిపోయి వందల ఏళ్లుగా ఇసుక కింద ఉండిపోయిన ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో శాస్త్రీయంగా తవ్వకాలు జరిపి వెలుగులోకి తెచ్చింది. ఈ తవ్వకాల్లో భాగంగా గర్భాలయం, శివలింగం, పార్వతీ అమ్మవారి మందిరం, నందీశ్వర విగ్రహాలు చెక్కుచెదరకుండా బయటపడ్డాయి.ప్రస్తుతం ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక కేంద్రంగా మారుతోంది.
ఈ చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంటనే ఆలయ పునర్నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన స్థపతి పరమేశ్వరప్ప జులైలో ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఆలయ నిర్మాణ శైలిని పరిశీలించారు. ఆలయాన్ని దాని అసలు రూపంలోనే, ప్రాచీన వాస్తు శిల్పకళా రీతులతో పునర్నిర్మించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ముందుగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా వెలికితీసి, ప్రతి శిల్పాన్ని, కొలతలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
తవ్వకాల్లో బయల్పడిన విగ్రహాలు
గత రెండు నెలలుగా శాస్త్రీయంగా సాగుతున్న ఈ తవ్వకాలు ఆదివారం నాటికి ఒక కీలక దశకు చేరుకున్నాయి. ఆలయం పూర్తిగా బయటపడటంతో పాటు అద్భుతమైన విగ్రహాలు లభ్యమయ్యాయి. ప్రధాన దైవమైన శివలింగం (నాగేశ్వరస్వామి లింగం) సురక్షితంగా బయల్పడింది. పార్వతీ దేవికి ప్రత్యేకమైన మందిరం ఉన్నట్లు గుర్తించారు. పరివార దేవతలుగా ఉన్న విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడి విగ్రహాలు అత్యంత కళాత్మకంగా చెక్కబడి ఉన్నాయి.
పర్యాటక ఆకర్షణగా మార్పు
ఈ తవ్వకాల వార్త వ్యాపించడంతో, ఈ ప్రాంతం ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, పర్యాటక, చారిత్రక ప్రదేశంగా మారుతోంది. ఈ ఆలయ పునరుద్ధరణ పూర్తయితే, పూర్వ వైభవం రావడమే కాకుండా భక్తులకు, చరిత్రకారులకు ఇదొక విశేష ప్రాంతంగా నిలవనుంది.
