
నెలాఖరులోగా విద్యార్థులందరికీ యూనిఫారాలు అందించాలి: సీఎస్ సంజయ్ జాజు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫారాలను నెలరోజుల్లోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి స్కూల్ యూనిఫారాల పంపిణీ, ఎల్‌నినో పరిస్థితులపై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
యూనిఫారాల తయారీ కోసం 26 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. యూనిఫారాలు, షూస్, స్కూల్ కిట్ల నాణ్యతపై స్వయంగా విద్యార్థుల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సీఎస్ గుర్తుచేశారు. కుట్టుపనుల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు
రాష్ట్రంలో ఐఎమ్‌డీ నివేదికల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు 27 శాతం లోటు వర్షపాతం నమోదైందని, 385 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని సీఎస్ వివరించారు. సెప్టెంబర్‌లోనూ తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రిజర్వాయర్లలోని నీటిని తాగునీటి అవసరాలకే నిల్వ చేస్తున్నామని చెప్పారు.
ఈ నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసేలా అధికారులు చైతన్యపరచాలన్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభిస్తుందని, పొలాల్లో ‘ఫామ్ పాండ్స్’ (పంట కుంటలు) నిర్మాణం విస్తృతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల అవగాహన కోసం ప్రతీ 45 రోజులకు ఒకసారి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సీఎస్‌లు సవ్యసాచి ఘోష్, దాన కిషోర్, వ్యవసాయ, నీటిపారుదల, పాఠశాల విద్యాశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
