
నెయ్యి వివాదంతో మాకు సంబంధం లేదు: హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి సరఫరాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారాన్ని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఖండించింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో తాము టీటీడీకి నెయ్యి సరఫరా చేశామంటూ వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని, అవన్నీ నిరాధారమైన పక్కా రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జె. సాంబమూర్తి శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ వాస్తవాలను వెల్లడించారు.
దుర్మార్గపు అబద్ధాలు.. రాజకీయ కుట్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్, సాక్షి మీడియా గ్రూప్ ఉద్దేశపూర్వకంగానే తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు "దుర్మార్గపు అబద్ధాలను" ప్రచారం చేస్తున్నాయని హెరిటేజ్ మండిపడింది. రాజకీయ లబ్ధి కోసమే హెరిటేజ్ సంస్థపై బురదజల్లుతున్నారని 2014-19 మధ్య కాలంలో టీటీడీకి తాము నెయ్యి సరఫరా చేశామన్నది పచ్చి అబద్ధమని సాంబమూర్తి తేల్చి చెప్పారు. పక్కా ప్రణాళికతోనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీతో తమకు ఎటువంటి యాజమాన్య, నిర్వహణ సంబంధాలు లేవని హెరిటేజ్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆ సంస్థ కేవలం ఒక స్వతంత్ర సంస్థ అని తమ మధ్య ఉన్న ఒప్పందం చాలా పరిమితమైనదని పేర్కొంది. పన్నీర్, చీజ్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పాలను ప్రాసెస్ చేయడం కోసం మాత్రమే ఇందాపూర్ డెయిరీతో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందాలను కలిగి ఉన్నామని అంతకు మించి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే విషయంలో ఎటువంటి లావాదేవీలు లేవని స్పష్టం చేసింది.
చట్టపరమైన చర్యలకు సిద్ధం
మరో ఐదు డెయిరీలతో కలిసి హెరిటేజ్ ఒక 'సిండికేట్'గా ఏర్పడి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిందన్న వాదనలను సంస్థ పూర్తిగా తోసిపుచ్చింది. తమ బ్రాండ్‌ను కించపరిచేలా వ్యవహరిస్తున్న ప్రతి వ్యక్తి సంస్థపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. గత 33 ఏళ్లుగా పాడి పరిశ్రమలో నమ్మకానికి మారుపేరుగా ఉన్నామని ఐఎస్ఓ 22001 సర్టిఫికేషన్‌తో అత్యున్నత ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం అన్యాయమని సంస్థ స్పష్టం చేసింది.
