
నెతన్యాహు మరణం వదంతులే.. స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమంగా ఉన్నారని, ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కార్యాలయం ఆదివారం స్పష్టం చేసింది. నెతన్యాహు హత్యకు గురయ్యారంటూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అనాడోలు ఏజెన్సీ ప్రతినిధి ప్రధాని కార్యాలయాన్ని వివరణ కోరారు. దీనిపై స్పందించిన కార్యాలయం.. "అవన్నీ తప్పుడు వార్తలు. ప్రధాని ఆరోగ్యంగా ఉన్నారు" అని కుండబద్దలు కొట్టింది.
ఆరో వేలు.. ఏఐ వీడియో వివాదం
ఈ పుకార్లు పుట్టడానికి ఒక వీడియో ప్రధాన కారణమైంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధంపై శుక్రవారం నెతన్యాహు ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వీడియోలో 0:35 నిమిషాల వద్ద నెతన్యాహు తన కుడి చేతిని ఎత్తినప్పుడు, ఆయనకు ఆరో వేలు ఉన్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు రచ్చ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన నకిలీ వీడియో అని, ఏఐ సాంకేతికతలో వచ్చే లోపాల వల్లే అలా అదనపు వేలు కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత క్యాండేస్ ఓవెన్స్ సైతం స్పందిస్తూ.. "నెతన్యాహు ఎక్కడ? నకిలీ వీడియోలను విడుదల చేసి ఎందుకు తొలగిస్తున్నారు?" అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఫ్యాక్ట్ చెక్: ఆరో వేలు లేదు!
ఈ వివాదంపై 'ఎక్స్' వేదికగా ఉన్న ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' ఫ్యాక్ట్ చెక్ చేసింది. నెతన్యాహుకు ఆరో వేలు లేదని తేల్చి చెప్పింది. వీడియోలో కనిపించిన అదనపు వేలు లాంటి ఆకారం కేవలం కాంతి నీడలు, చేతి కోణం, అరచేతి సహజ ఆకృతి వల్ల కలిగిన భ్రమ అని వివరించింది. ప్రభుత్వ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన అధికారిక ఫుటేజీని పరిశీలిస్తే ఆయనకు ఐదు వేలే ఉన్నాయని స్పష్టమవుతుందని స్పష్టం చేసింది.
యుద్ధం మధ్యలో సంచలనం
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో మొదలైన యుద్ధం ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో రగిలిపోయిన ఇరాన్.. పొరుగున ఉన్న చమురు ఎగుమతి దేశాలపై ప్రతీకార దాడులకు దిగింది. ఇందులో భాగంగానే కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. రోజుకు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అయ్యే ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల్లోనే నెతన్యాహు మరణంపై కుట్ర సిద్ధాంతాలు తెరపైకి రావడం గమనార్హం.
