
నెతన్యాహుపై అవినీతి కేసులు.. రేపటి నుంచి కోర్టులో విచారణ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజెమిన్ నెతన్యాహు ఎదుర్కొంటున్న అవినీతి కేసుల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థపై విధించిన అత్యవసర ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఈ ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం 9:30 గంటల నుంచి జెరూసలేం జిల్లా కోర్టులో విచారణ పునఃప్రారంభం కానున్నట్లు 'ది జెరూసలేం పోస్ట్' పత్రిక వెల్లడించింది.
షెడ్యూల్ ఖరారు
కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాధారణ షెడ్యూల్ అమల్లోకి రానుంది. ప్రతి ఆదివారం జెరూసలేం జిల్లా కోర్టులో, తిరిగి సోమవారం నుంచి బుధవారం వరకు టెల్ అవీవ్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఆదివారం జరగబోయే విచారణలో డిఫెన్స్ (ప్రతివాద) సాక్షి వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ న్యాయ మంత్రిత్వ శాఖ కోర్టులపై ఆంక్షలు విధించింది. కేవలం అత్యవసర కేసులను మాత్రమే విచారించే 'స్పెషల్ ఎమర్జెన్సీ' ఫార్మాట్ గురువారంతో ముగియడంతో, నెతన్యాహు కేసు మళ్లీ పట్టాలెక్కనుంది.
ప్రధానంగా కేసు-4000పై దృష్టి
ప్రస్తుతం విచారణ 'క్రాస్ ఎగ్జామినేషన్' దశలో ఉంది. ప్రధానంగా 'కేసు 4000' (బెజెక్-వాల్లా వ్యవహారం)పై కోర్టు దృష్టి సారించింది. నెతన్యాహుపై నమోదైన మూడు కేసుల్లో ఇది అత్యంత తీవ్రమైనది, ఇందులో ఆయనపై లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ నిలిచిపోయే సమయానికి.. బెజెక్-యస్ విలీనం, వ్యాపారవేత్త షాల్ ఎలోవిచ్‌తో సంబంధాలు, టెలికాం శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ శ్లోమో ఫిల్బర్‌తో జరిగినట్లు చెబుతున్న సమావేశంపై ప్రాసిక్యూటర్లు నెతన్యాహును ప్రశ్నిస్తున్నారు. అయితే నెతన్యాహు ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చారు.
కేసు నేపథ్యం ఏమిటి?
బెంజెమిన్ నెతన్యాహుపై 2019లో అధికారికంగా అవినీతి కేసులు నమోదయ్యాయి. వీటిని 1000, 2000, 4000 కేసులుగా పిలుస్తారు. ధనవంతుల నుంచి విలాసవంతమైన బహుమతులు తీసుకోవడం, మీడియా సంస్థలకు ప్రభుత్వపరంగా ప్రయోజనాలు కల్పించి, బదులుగా వారు తనకు అనుకూలంగా వార్తలు రాసేలా ఒప్పందాలు చేసుకోవడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇందులో 'కేసు 4000' అత్యంత కీలకమైనది.
కోర్టు బోనులో తొలి ప్రధాని
ఇజ్రాయెల్ చరిత్రలోనే అధికారంలో ఉండి కూడా ఒక నేరస్థుడిగా కోర్టు బోనులో నిలబడిన తొలి ప్రధాని నెతన్యాహునే. 2024 డిసెంబర్‌లో ఆయన కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 2025 జూన్ నుండి ప్రాసిక్యూటర్లు ఆయనను ప్రశ్నించడం (క్రాస్ ఎగ్జామినేషన్) మొదలుపెట్టారు. అయితే దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళం, వరుస యుద్ధాల కారణంగా ఈ విచారణ అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఆ అడ్డంకులు తొలగడంతో మళ్లీ విచారణ పట్టాలెక్కనుంది.
