Let's talk: editor@tmv.in
నూతన సంవత్సర కానుక.. ఏపీలో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

నూతన సంవత్సర కానుక.. ఏపీలో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

Shaik Mohammad Shaffee
1 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర సందర్భంగా పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తెలిపారు. సాధారణంగా జనవరి 1న ఇచ్చే పెన్షన్లను ఈసారి డిసెంబర్ 31నే అందజేస్తున్నట్లు ప్రకటించారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాష్ట్రంలోని లక్షలాది మంది లబ్ధిదారుల్లో ఆనందం నింపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31నే పెన్షన్లు పంపిణీ చేయడం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా ద్వారా కూడా వెల్లడించారు. “నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నాం. జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31నే పెన్షన్లు అందిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

63 లక్షల మందికి ప్రయోజనం

డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,700 కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మొత్తంతో 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. అలాగే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెన్షన్ల కోసం రూ. 50,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

నేరుగా ఇంటి వద్దకే..

పెన్షన్ల పంపిణీ పేదలకు ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా, ప్రభుత్వానికి అత్యంత సంతృప్తిని ఇచ్చే కార్యక్రమమని ముఖ్యమంత్రి అన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన స్పష్టం చేశారు. కాగా నూతన సంవత్సరం వేళ ముందుగానే పెన్షన్లు అందడంతో రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరెవరికి ఎంత పెన్షన్?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద వివిధ వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులకు నెలకు రూ. 4,000 పెన్షన్ అందుతుంది. అలాగే దివ్యాంగులకు నెలకు రూ.6,000 అందజేస్తుండగా, పూర్తిస్థాయి వైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 వరకు పెన్షన్ ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ.10,000 ఆర్థిక సాయం అందుతుంది.