
నీతి ఆయోగ్ సెమినార్‌కు ఎంపికైన నిర్మల్ జిల్లా
నిర్మల్ జిల్లాలోని పెంబి బ్లాక్‌కు మరోసారి గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్‌కు పెంబి బ్లాక్ ఎంపికైందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడించారు. ఈ సెమినార్ మార్చి 9న విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. దక్షిణ జోన్–3కు చెందిన ఆరు రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రాంతాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను పంచుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలు మాత్రమే ఈ సెమినార్‌కు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. నిర్మల్ జిల్లాలోని పెంబి బ్లాక్ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రాథమిక వసతులు, మహిళా సాధికారత వంటి రంగాల్లో చేపట్టిన పలు ఆవిష్కరణాత్మక కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రదర్శించనుంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సెమినార్‌లో పాల్గొని పెంబి బ్లాక్‌లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు వివరించనున్నారు.
గిరిజన ప్రాంతమైన పెంబి మండలంలో గతంలో విద్యారంగంలో అక్షరాస్యత తక్కువగా ఉండటం, పత్తి కోత సమయంలో విద్యార్థుల డ్రాప్‌అవుట్‌లు పెరగడం, ఉపాధ్యాయుల కొరత, తక్కువ పరీక్షా ఫలితాలు వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గత రెండు సంవత్సరాలుగా పలు చర్యలు చేపట్టారు. విద్యా వాలంటీర్ల నియామకం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆమె తెలిపారు.
అలాగే బాలశక్తి, అగ్రో ఫారెస్ట్రీ, మహిళా శక్తి, అమ్మ రక్షిత వంటి కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో అమలు చేయడం ద్వారా ఆరోగ్య సేవలు, పోషకాహార లోపం తగ్గింపు, మట్టిపరీక్ష కార్డుల పంపిణీ వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించబడింది. 2024 డిసెంబర్‌లో నీతి ఆయోగ్ నిర్వహించిన ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 500 బ్లాకుల్లో పెంబి బ్లాక్ నాలుగో స్థానం సాధించి రూ.1 కోటి ప్రోత్సాహక నగదు అందుకుంది.
ఈ విజయానికి అన్ని శాఖల సమిష్టి కృషి కారణమని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా జిల్లా పరిపాలన, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
