
నీట్ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ మద్దతు.. నేడు ఇందిరా పార్క్ వద్ద బీఆర్‌ఎస్‌వీ నిరసన
నీట్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం(బీఆర్‌ఎస్‌వీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఆందోళనకు సంఘీభావంగా తాను స్వయంగా హాజరవుతానని కేటీఆర్ తెలిపారు.
వరంగల్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. నీట్ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా బీఆర్‌ఎస్‌వీ నిర్వహించే నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గ్లోబరీనా సంస్థ వివాదంపై స్పందన
గ్లోబరీనా సంస్థ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పరువు నష్టం (డిఫమేషన్) లీగల్ నోటీసు పంపినట్లు వెల్లడించారు.
"గ్లోబరీనా నిజంగానే నా బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుంది? కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం?" అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఆరోపణలను రుజువు చేయలేకపోతే ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఐడీ విచారణకు సిద్ధం
గ్లోబరీనా వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే సీఐడీ విచారణతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని తెలిపారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై కూడా సిట్ లేదా సీఐడీ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరికి ఆరోపణలు చేయడం కాకుండా, నిజానిజాలు వెలుగులోకి రావడానికి స్వతంత్ర విచారణ జరగాలని అన్నారు.
కేంద్రంపై సీఎం వైఖరిపై విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించడం లేదని అన్నారు.
రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సిన సందర్భంలో కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై నిజంగా పోరాడే ఉద్దేశం ఉంటే నేరుగా రాజ్‌భవన్‌ను ముట్టడించాల్సిందని సూచించారు.
"కాంగ్రెస్‌తో పగలు.. బీజేపీతో రాత్రి"
రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. "రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో ఉంటాడు.. రాత్రి బీజేపీతో ఉంటాడు" అని వ్యాఖ్యానించారు.
"కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడు. కాంగ్రెస్‌కు ఒక మూట.. బీజేపీకి రెండు మూటలు.. ఇదే రేవంత్ రెడ్డి పాలన" అంటూ విమర్శించారు.
ముఖ్యమంత్రి ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం సహా ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్
గ్లోబరీనా సంస్థపై తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని నిరూపించలేకపోతే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని, వాస్తవాల ఆధారంగానే మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం కూడా అదే పారదర్శకతను ప్రదర్శించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అలాగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయంపై లీగల్ నోటీసు పంపారు.
