Let's talk: editor@tmv.in
నీట్ మినహాయింపు బిల్లు: రాష్ట్రపతి నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన స్టాలిన్ సర్కార్

నీట్ మినహాయింపు బిల్లు: రాష్ట్రపతి నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన స్టాలిన్ సర్కార్

Shaik Mohammad Shaffee
17 నవంబర్, 2025

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి తమిళనాడు రాష్ట్రానికి మినహాయింపునిచ్చే ఉద్దేశంతో శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తమిళనాడు అడ్మిషన్ టు అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సెస్ బిల్లు, 2021కు రాష్ట్రపతి ఆమోదం నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది.

బిల్లు నేపథ్యం

తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లు, నీట్ నుంచి రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీని ద్వారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను తిరిగి 12వ తరగతి మార్కుల ఆధారంగా, ఒక సైంటిఫిక్ నార్మలైజేషన్ వ్యవస్థతో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ, పేద విద్యార్థులు నీట్ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతి నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మార్చి 4న గవర్నర్ సెక్రటేరియట్ నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ బిల్లుకు ఆమోదం నిలిపివేయడం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు యాంత్రికంగా జరిగిందని, ఎటువంటి సమంజసమైన కారణాలు చూపకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రంలోని ఆరోగ్య, విద్య, ఆయుష్ మంత్రిత్వ శాఖలు లేవనెత్తిన ప్రతి అభ్యంతరానికి రాష్ట్ర ప్రభుత్వం వివరణాత్మక సమాధానాలు ఇచ్చిందని, అయినప్పటికీ ఆమోదాన్ని నిలిపివేశారని పేర్కొంది. రాష్ట్రపతి చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని, ఇది చట్టపరమైన విషయంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలను నియంత్రించే రాజ్యాంగ వ్యవస్థను తీవ్రంగా ఉల్లంఘించిందని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రపతి ఆమోదం నిలిపివేత రాజ్యాంగంలోని రెండు కీలక ఆర్టికల్‌లను ఉల్లంఘించిందని కూడా పిటిషన్‌లో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. కారణం లేకుండా ఆమోదం నిలిపివేయడం ఆర్టికల్ 201ను నిర్వీర్యం చేయడమే అని, అలాగే ఆర్టికల్ 254(2) అమలును అడ్డుకోవడమని పేర్కొంది. ఈ ఆర్టికల్ ప్రకారం, సమాంతర జాబితాలోని విషయాలపై రాష్ట్ర చట్టాలు రాష్ట్రపతి ఆమోదం పొందితే, రాష్ట్రంలో కేంద్ర చట్టంపై ప్రాధాన్యత కలిగి ఉంటాయి. “ఈ విధమైన ఆమోదం నిలిపివేతకు సమర్థన లభిస్తే, రాష్ట్రాలు యూనియన్ చట్టాలకు భిన్నంగా చట్టాలు చేసినా అవి ప్రయోజనం లేకుండాపోతుంది” అని కూడా స్టాలిన్ సర్కార్ పేర్కొంది.

గతంలో నీట్ పరీక్షలలో నకిలీ వ్యక్తుల హాజరు, అవకతవకలు, పేపర్ లీక్‌లు వంటి సంఘటనలు జరిగినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. కేవలం సంఖ్యాపరమైన స్కోరు వైద్య వృత్తికి అవసరమైన గుణాత్మక లక్షణాలను కొలవలేదని కూడా తమిళనాడు ప్రభుత్వం వాదించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని 2021 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం నిలిపివేసిన చర్యను "రాజ్యాంగ విరుద్ధం, రద్దు చేయదగినది"గా ప్రకటించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

అసలేంటి వివాదం?

తమిళనాడు–కేంద్రం మధ్య వివాదం నీట్ మినహాయింపు అంశంపై నెలకొంది. తమిళనాడు ప్రభుత్వం 2021లో ఒక బిల్లును పాస్ చేసి, నీట్ లేకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. నీట్ వల్ల పేద, గ్రామీణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నారని, కోచింగ్‌పై ఆధారపడాల్సి వస్తోందని, గతంలో పరీక్షలో అవకతవకలు కూడా జరిగాయని వాదిస్తోంది. కానీ కేంద్రం మాత్రం నీట్ దేశవ్యాప్తంగా ఒకే రకం మెరిట్ ప్రమాణం అందిస్తుందని, అందుకే మినహాయింపు ఇవ్వలేమని చెబుతోంది. రాష్ట్రపతి ఆమోదం నిలిపివేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లింది. మరి ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.