
నీటి హక్కుల విషయంలో రేవంత్ సర్కార్ మొద్దునిద్ర: మాజీ మంత్రి హరీష్ రావు
కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలోని బీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీటి హక్కులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.
గోదావరి, బనకచర్ల అంశాలపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్ రాష్ట్రానికి వచ్చి నెల రోజులు గడిచినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలపై తమ ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఫిబ్రవరి 12నే రాష్ట్రానికి వచ్చినప్పటికీ, అందులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నెల రోజులు గడిచినా సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడడం లేదని విమర్శించారు.
ఏపీ అసెంబ్లీలో పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అక్కడి గవర్నర్ ప్రసంగంలో పేర్కొంటే, దానికి దీటుగా స్పందించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో పోలవరం అడ్డుకుంటామని గానీ, చుక్క నీరు వదులుకోమని గానీ ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై 7 ప్రాజెక్టులకు సంబంధించి 400 టీఎంసీల నీటి హక్కులను సాధించిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఉన్న హక్కులను కాపాడుకోవడంలో విఫలమవుతూ ఏపీ నీటి దోపిడీకి సహకరిస్తోందని ఆయన ఆరోపించారు.
బడ్జెట్ సమావేశాల పని దినాలను పెంచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తాము అసెంబ్లీలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం లేఖల డ్రామాలు కట్టిపెట్టి, తెలంగాణ నీటి వాటా కోసం గట్టిగా పోరాడాలని హితవు పలికారు.
