
నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ సర్కార్ విఫలం: హరీశ్ రావు
తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా చిల్లర మాటలు మానేసి తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అలా చేస్తే బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇచ్చిన అనుమతుల రద్దు కోరుతూ ఢిల్లీలో ధర్నా చేపట్టాలని ఆయన సూచించారు.
ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై విమర్శలు
రేవంత్ రెడ్డిని ఉద్దేశించి “నాడు ఉద్యమ ద్రోహి, నేడు నీళ్ల ద్రోహి” అంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తూ తెలంగాణ నీటి ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్న ఆదిత్యనాథ్ దాస్‌ను నేడు తెలంగాణ నీటి సలహాదారుడిగా, బనకచర్ల కమిటీలోనూ నియమించడం ద్వారా సీఎం తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
బనకచర్ల - నల్లమల సాగర్ వివాదం
బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా చివరకు జరిగేది తెలంగాణకు జల దోపిడేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేస్తున్నామని ప్రకటించగానే, అది తన ప్రతాపమని సీఎం, నీళ్ల మంత్రి డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు మళ్లించకుండా, పోలవరం, నల్లమల సాగర్ లింక్ చేశారని ఆరోపించారు.
గోదావరి నీళ్లను కృష్ణా ద్వారా తరలిస్తే బచావత్ అవార్డు ప్రకారం 45:21:14 నిష్పత్తిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కృష్ణా నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందని హరీశ్ రావు గుర్తు చేశారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై ఈ నిబంధన వర్తిస్తుందని, అందుకే ఏపీ ప్రభుత్వం పోలవరం, నల్లమల సాగర్ పేరుతో శరవేగంగా పావులు కదుపుతోందన్నారు. ఈ కీలక అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర నటిస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హరీశ్ రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను వేసిన కమిటీని రద్దు చేసి, పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని అసెంబ్లీలో స్పష్టమైన తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
