Let's talk: editor@tmv.in
నీటి హక్కులపై రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

నీటి హక్కులపై రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
5 జనవరి, 2026

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా తెలిపారు. అసెంబ్లీలో జరిగిన 'నీళ్లు, నిజాలు' అనే స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ, గణాంకాలతో సహా గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతను దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని, ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయనని ఆయన ఉద్వేగంగా దేవుడిపై ప్రమాణం చేశారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 490 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించి 24 ప్రాజెక్టులు మంజూరయ్యాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ పరివాహక ప్రాంతం 71 శాతంగా ఉందని, అంతర్జాతీయ జల వివాదాల పరిష్కార సూత్రాల ప్రకారం తెలంగాణకు 555 టీఎంసీలు రావాలని వివరించారు. ఒకవేళ ట్రిబ్యునల్ ప్రాతిపదికన 1005 టీఎంసీల నీటి లభ్యతను పరిగణలోకి తీసుకుంటే, తెలంగాణకు 763 టీఎంసీలు దక్కాలని ఆయన లెక్కలతో సహా వివరించారు. ఈ లెక్కల ఆధారంగానే ప్రభుత్వం పోరాటం చేస్తుంటే, ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చేసి అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు.

2005 నుంచి 2014 మధ్య కృష్ణా బేసిన్‌లో అనేక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పరిపాలించిన నాయకులు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 490 టీఎంసీలు కేటాయిస్తే, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 299 టీఎంసీలకే అంగీకరించారని ఆరోపించారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు ఈ కేటాయింపులకే కట్టుబడి ఉంటామని సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ తమకు అనుకూలంగా ఉపయోగించుకుందని అన్నారు.

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు తొలి విడతగా 45 టీఎంసీలు, రెండో విడతగా మరో 45 టీఎంసీలు అనుమతించాల్సిందేనని, లేదంటే జూరాల నుంచి నేరుగా నీటిని తరలించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏ సమస్యైనా చర్చల ద్వారానే పరిష్కరించవచ్చని, జల వివాదాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

2014 వరకు రాయలసీమకు 4.47 టీఎంసీల నీటిని తరలిస్తే, 2014 తర్వాత 13.12 టీఎంసీలకు పెరిగిందని పేర్కొంటూ, ఇది గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన “బహుమానం” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చాలని ఎవరూ సూచించలేదని, అయినా సోర్సు మార్చడంతో లిఫ్టులు 3 నుంచి 5కు, పంపులు 22 నుంచి 37కు పెరిగాయని తెలిపారు. జూరాల నుంచి ప్రారంభిస్తే ప్రతి దశలో నీటి పారుదల ప్రాంతం స్పష్టంగా నిర్దేశించారని, కానీ శ్రీశైలం సోర్సుగా తీసుకున్న పథకంలో 19 పంపుల వరకు నీటి వినియోగం నిల్‌గా ఉందని చెప్పారు.

ప్రాజెక్టుకు 2022 వరకు డీపీఆర్ కూడా తయారు చేయలేదని, అంచనాలను రూ.55,800 కోట్లకు పెంచారని విమర్శించారు. మొదట రూ.32,200 కోట్లతో ప్రారంభమైన పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు రూ.లక్ష కోట్లకు చేరే పరిస్థితి వచ్చిందని, ఏడు సంవత్సరాల పాటు సరైన అంచనాలు లేకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు చెల్లించారని ఆరోపించారు. జూరాల నుంచి శ్రీశైలంకు సోర్సు మార్చినప్పటికీ, అది సాగునీటి ప్రాజెక్టు కాదని, కేవలం 7.15 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టేనని ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని అడిగినట్లు చెబుతున్న వాదనల్లో నిజం లేదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఖర్చుతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రానికి లేఖ రాసిన విషయం సభలో వెల్లడించారు. అలాగే గోదావరి, బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు 2016లోనే పునాది పడిందని, గోదావరిలో మిగులు జలాలున్నాయని కేంద్ర సమావేశంలో ఆనాటి సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తప్పిదాన్ని సవరించుకునేందుకు 2020లో వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదని విమర్శించారు.

సభలో భావోద్వేగానికి లోనైన సీఎం, తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. దేవుడు ఇచ్చిన ఈ బాధ్యతను గౌరవంగా భావిస్తున్నానని, ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయనని దేవుడిపై ప్రమాణం చేశారు. నాకు ముందుగా నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాత నాయకుడు అని స్పష్టం చేశారు.

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును తొలి దశలో 45 టీఎంసీలు, రెండో దశలో మరో 45 టీఎంసీలతో పూర్తి చేయాలన్న కంకణంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం తెలిపారు. మొదటి విడతకు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి కోరామని, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ నుంచి కేటాయింపులు సాధించి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల కోసం సైనికుల్లా నిరంతరం పోరాడుతున్నామని, ఎవరు అడ్డుపడినా నిటారుగా నిలబడి కొట్లాడుతామని ఆయన అన్నారు.

తోలు తీస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఫైర్‌: ‘నాలుక కోసేస్తాం’

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు, ముఖ్యంగా రైతులకు పూర్తిగా అంకితభావంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

2021లో కేంద్ర ప్రభుత్వాన్ని, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను ఉద్దేశించి కేసీఆర్ “మీ నాలుక కోస్తాం” అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు రైతులకు తమ నిబద్ధతపై ఎవరు ప్రశ్నించినా తాము వెనుకడుగు వేయబోమని హెచ్చరించారు. మమ్మల్ని తొక్కుతామంటారా? నాలుక కోస్తామంటారా? అలాంటి మాటలు మాట్లాడినవారి నాలుకనే మేం కోస్తాం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను అధికారికంగా సభ రికార్డుల్లో నమోదు చేయాలని స్పీకర్‌ను కోరారు.

నీటి హక్కులపై రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku