Let's talk: editor@tmv.in
నీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన సీఎం చంద్రబాబు

నీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
6 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం "జల భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత" పేరుతో ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. నీటి సంరక్షణను ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని, ఇందులో రైతులు, సాగునీటి సంఘాలు, గ్రామ పంచాయతీలు చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం తాడిపత్రి (అనంతపురం జిల్లా) నుంచి ప్రారంభించనున్నారు.

ఏప్రిల్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న ఈ ప్రణాళికలో నీటి వనరుల సంరక్షణ, రక్షణపై వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టనున్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి నీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి నీటి భద్రత అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల స్థాయిని మెరుగుపరచి రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వేసవికి ముందు భూగర్భ జలాలు 6 మీటర్ల లోపల ఉండేలా, వర్షాకాలం అనంతరం 3 మీటర్ల లోపలికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యాచరణ ప్రణాళికలో జలవనరుల శాఖ, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ శాఖ, పశుసంవర్థక శాఖ వంటి విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్ అసోసియేషన్లు ఈ ప్రణాళిక అమలులో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ 100 రోజుల ప్రణాళికను నాలుగు దశల్లో అమలు చేయనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు పనుల గుర్తింపు, ఏప్రిల్ 16 నుంచి 20 వరకు పరిపాలనా అనుమతులు, ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనుల అమలు, జూలై 10 నుంచి 14 వరకు పూర్తి చేసిన పనుల నివేదికలు సమర్పించడం జరుగుతుంది.

రాష్ట్రంలో మొత్తం 5,697 గ్రామాలను భూగర్భ జలాల సమస్యలతో బాధపడుతున్న ప్రాంతాలుగా గుర్తించారు. ట్యాంకులను నింపడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భూగర్భ జలాల స్థాయిని కనీసం 1.5 మీటర్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతికంగా ఉపగ్రహ చిత్రాలు, హైడ్రోలాజికల్ మ్యాపింగ్ ఉపయోగించి శాస్త్రీయ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. అలాగే నీటి బడ్జెట్లు సిద్ధం చేయడం, నీటి ఆడిట్లు నిర్వహించడం ద్వారా వనరుల సమర్థ వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. అన్నమయ్య జిల్లాలో విజయవంతమైన 'ప్రాజెక్ట్ జలధార' స్ఫూర్తితో వాగులు, వంకలను అనుసంధానించి నీటి నిల్వను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.