
నీటి యుద్ధాలు రాకముందే మేల్కొందాం: హైడ్రా కమిషనర్
ప్రస్తుతం ప్రపంచంలో ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నా, భవిష్యత్తులో జలవనరుల కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని, ఆ పరిస్థితి రాకముందే జలవనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూలో సోమవారం నిర్వహించిన 'ప్రపంచ జల దినోత్సవం' వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ నగర జనాభా 1.60 కోట్లు నుంచి 2050 నాటికి 3 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో నగరంలోని గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణను చేపట్టిందని తెలిపారు. మొదటి దశలో 6 చెరువులలో 3 పనులు పూర్తి కాగా, మరో 3 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, రెండో దశలో 18 మరిన్ని చెరువులను పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు. చెరువుల పునరుద్ధరణ వల్ల వర్షాకాలపు వరదలను నియంత్రించడమే కాక, భూగర్భ జలాలను పెంచడానికి కూడా అవకాశం ఉంటుందన్నారు.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం 1975 నుంచి 2023 వరకు నగరంలోని 61శాతం చెరువులు మాయమయ్యాయని, మరి 15 సంవత్సరాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారతుందని ఆయన హెచ్చరించారు. మొత్తం 1300 చెరువుల్లో 700 మాయమయ్యాయని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఉన్నవి 60 శాతం చెరువులు కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు. హైడ్రా ఆక్రమణలను తొలగించి, తమ్మిడికుంట చెరువును 14 ఎకరాల నుంచి 29 ఎకరాలుగా విస్తరించినట్లు తెలిపారు.
నేడు హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు పిక్నిక్ స్పాట్‌లుగా మారుతున్నాయని, ప్రజల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన పెరిగిందని చెప్పారు. బడాబాబుల ఆక్రమణల నుంచి ఇప్పటివరకు 1350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని రంగనాథ్ వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ నాలా, అమీర్‌పేట నాలాల్లో పూడికతీత పనుల వల్ల అనేక కాలనీలకు వరద ముప్పు తప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి ఇతర నిపుణులు పాల్గొని, నీటి వనరుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని అభినందించారు.
