Let's talk: editor@tmv.in
నీటి కష్టాలకు 'టెక్' సొల్యూషన్స్..మేధావులకు జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆహ్వానం

నీటి కష్టాలకు 'టెక్' సొల్యూషన్స్..మేధావులకు జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆహ్వానం

Panthagani Anusha
30 డిసెంబర్, 2025

దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు తక్కువ ఖర్చుతో, అధునాతన సాంకేతికత ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనడమే 'జల్‌శక్తి హ్యాక్‌థాన్‌-2025' ప్రధాన ఉద్దేశమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వై.ఆర్.ఎస్.రావు పేర్కొన్నారు. సోమవారం కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సామాన్యుడి ఆలోచనకు పెద్దపీట

ఈ సందర్భంగా డాక్టర్ రావు మాట్లాడుతూ.. నీటి సంరక్షణ అనేది కేవలం శాస్త్రవేత్తలకే పరిమితమైన అంశం కాదని, సామాన్య రైతు నుంచి మేధావుల వరకు ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో తాము గమనించిన నీటి సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలను పది లైన్లలో 'bharatwin.mowr.gov.in' పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఎంపికైన ఉత్తమ ఆలోచనలకు జలశక్తి మంత్రిత్వ శాఖ రూ.1 లక్ష నుంచి రూ.1 కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ కార్యక్రమం రాబోయే ఐదేళ్ల పాటు నిరంతరంగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. మైక్రో ప్లాస్టిక్స్, మందుల వ్యర్థాల వల్ల కలుగుతున్న జల కాలుష్యంపై యువత దృష్టి సారించాలని సూచించారు.

సాంకేతికతతోనే అభివృద్ధి: ప్రఖర్ జైన్

రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈవో ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర వనరులు తక్కువగా ఉన్నా సాంకేతికతతో ఆ లోటును భర్తీ చేయవచ్చని తెలిపారు. విద్యార్థులు చేసే ప్రాజెక్టులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజ హితానికి తోడ్పడాలన్నారు. నగరాల్లో వరదలు, అటవీ సంరక్షణ, కనకదుర్గమ్మ ఆలయ రద్దీ వంటి సమస్యలకు డ్రోన్లు, కెమెరాల వంటి ఆధునిక పరిజ్ఞానంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో 38 హ్యాక్‌థాన్లు అందుబాటులో ఉన్నాయని యువత వీటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

వికసిత్ భారత్-2047 లక్ష్యంగా

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎన్. జ్యోతి కుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని ఆకలి నుంచి గట్టెక్కించిన సివిల్ ఇంజనీర్లు ఇప్పుడు నీటి నిర్వహణ (వాటర్ మేనేజ్మెంట్)పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ ఎక్స్‌పర్ట్ ఎ.వరప్రసాద రావు మాట్లాడుతూ స్థానిక జలవనరులపై అవగాహనతో డేటా ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని కోరారు. సైంటిస్ట్ డాక్టర్ ఎస్వీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. 'వికసిత్ భారత్–2047' లక్ష్యంగా వరదలు, కరువు, భూగర్భ జలాల తగ్గుదల వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడమే ఈ హ్యాక్‌థాన్ ఉద్దేశమన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ వైస్ ఛాన్సలర్ పి. వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.