Let's talk: editor@tmv.in
నీటిని పొదుపుగా వాడుకోవాలి: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

నీటిని పొదుపుగా వాడుకోవాలి: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

Gaddamidi Naveen
14 ఏప్రిల్, 2026

నగరంలో ఎండలు ముదురుతుండటం, భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై జలమండలి కీలక సమీక్ష నిర్వహించింది. ప్రతి కుటుంబం కనీసం 20 శాతం నీటిని ఆదా చేయాలని, అప్పుడే వేసవి గండం నుంచి గట్టెక్కగలమని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నీటి సరఫరా పరిస్థితులు, ట్యాంకర్ బుకింగ్‌లు, డెలివరీ సమయాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ట్యాంకర్ బుకింగ్‌లు పెద్దగా పెరగకపోయినా, కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో మాత్రం డిమాండ్ పెరిగినట్లు ఎండీ తెలిపారు. ముఖ్యంగా మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్‌పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లలో బుకింగ్‌లు అధికంగా నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పెండెన్సీని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, వచ్చే రెండు రోజుల్లో పెండింగ్‌ను సున్నా స్థాయికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచడం, డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లను మళ్లించడం, సరఫరా సమయాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. డిమాండ్ తక్కువగా ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లను సమర్థవంతంగా కేటాయించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడం వల్ల పెండెన్సీ గణనీయంగా తగ్గిందని ఎండీ తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్‌లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని సూచించారు. అలాగే రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు ట్యాంకర్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలతో ట్యాంకర్ బుకింగ్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పౌరులకు జలమండలి ముఖ్య సూచనలు

పౌరులు నీటిని బాధ్యతగా వినియోగించాలని, వృథాను నివారించాలని ఎండీ మరోసారి విజ్ఞప్తి చేశారు. వాహనాల శుభ్రత, పరిసరాల కడగడం వంటి పనులకు తాగునీటిని వినియోగించరాదని సూచించారు. బ్రష్ చేసేటప్పుడు ట్యాప్‌ను నిరంతరం తెరిచి ఉంచకుండా మగ్గులో నీరు తీసుకుని ఉపయోగించాలని తెలిపారు. స్నానం కోసం షవర్ వినియోగాన్ని తగ్గించి బకెట్ స్నానం చేయడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని చెప్పారు. పైపులు, ట్యాపుల్లో లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలని ఆయన పిలుపునిచ్చారు.

జలమండలి ఇప్పటికే సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోందని, అయితే వేసవి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎండీ స్పష్టం చేశారు. “నీరు అమూల్యమైన వనరు. ప్రతి చుక్కను జాగ్రత్తగా వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత సాధ్యమవుతుంది” అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, ఆపరేషన్స్ డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.