
నిస్సంక ధనాధన్.. శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓటమి
సొంతగడ్డపై శ్రీలంక గర్జించింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక (100 నాటౌట్) వీరోచిత సెంచరీతో చెలరేగడంతో సోమవారం జరిగిన కీలక పోరులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ విజయంతో లంకేయులు దర్జాగా 'సూపర్-8' దశకు చేరుకోగా, పరాజయంతో ఆస్ట్రేలియా కథ దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 18 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది.
నిస్సంక వీరవిహారం.. మెండిస్ దెబ్బ
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కుశాల్ పెరీరా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో స్టేడియం నిశ్శబ్దమైంది. అయితే, నిస్సంకకు తోడైన కుశాల్ మెండిస్ (51) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించి ఆసీస్ బౌలర్లను ఉతికేసారు. నిస్సంక కేవలం 52 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయ సెంచరీ సాధించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. చివర్లో పవన్ రత్నాయకే (28 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లంక లక్ష్యాన్ని సులువుగా అందుకుంది.
మార్ష్, హెడ్ మెరుపులు
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన మార్ష్ ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కేవలం 9 ఓవర్లలోనే 104 పరుగులు జోడించడంతో ఆసీస్ 200 దాటుతుందని భావించారు. అయితే, లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంత (3/37) అద్భుత స్పెల్‌తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. చివరి 4 వికెట్లను కేవలం 6 పరుగుల వ్యవధిలోనే కోల్పోయిన ఆస్ట్రేలియా.. నిర్ణీత ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది.
పథిరానాకు గాయం
మ్యాచ్ ప్రారంభంలోనే శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ మతీషా పథిరానా కేవలం మూడో ఓవర్ వేస్తూ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత దసున్ శనక ఓవర్‌ను పూర్తి చేశాడు. మార్ష్ వరుసగా ఐదు ఫోర్లు బాదడంతో పవర్ ప్లేలో ఆసీస్ 70 పరుగులు చేసింది. కానీ, నిస్సంక పాయింట్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ గ్లెన్ మాక్స్‌వెల్ (22) ఇన్నింగ్స్‌ను ముగించి మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు?
జింబాబ్వే చేతిలో ఇప్పటికే ఓటమి పాలైన ఆస్ట్రేలియాకు ఈ ఓటమి మింగుడుపడటం లేదు. ఇక ఆసీస్ సెమీస్ చేరాలంటే తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ తేడాతో గెలవడమే కాకుండా, శ్రీలంక, ఐర్లాండ్‌లు జింబాబ్వేను ఓడించాలని కోరుకోవాలి. ఒకవేళ గురువారం జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే, ఒమన్‌తో మ్యాచ్ ఆడకముందే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
సూపర్-8కు ఇంగ్లాండ్.. ఇటలీపై అద్భుత విజయం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన హోరాహోరీ పోరులో ఇటలీపై 24 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ 'సూపర్-8'లోకి అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివర్లో విల్ జాక్స్ కేవలం 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 53 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించగా, ఫిలిప్ సాల్ట్ (28), టామ్ బాంటన్ (30) కూడా కీలక పరుగులు జోడించారు. ఇటలీ బౌలర్ క్రిషన్ కలుగమగే రెండు వికెట్లు పడగొట్టాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ చివరి వరకు పోరాడి 178 పరుగులకు ఆలౌట్ అయింది. ఇటలీ బ్యాటర్లలో బెన్ మానేంటి (60) మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, జస్టిన్ మోస్కా (43), గ్రాంట్ స్టెవర్ట్ (45) పోరాడారు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు జేమీ ఓవర్టన్, సామ్ కరన్ తలో మూడు వికెట్లతో ఇటలీని కట్టడి చేసి విజయాన్ని ఖాయం చేశారు. ఈ విజయంతో గ్రూప్-సి నుంచి ఇంగ్లాండ్ తదుపరి దశకు చేరుకోగా, ఇటలీ పోరాటం ముగిసింది.
టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన అఫ్గాన్
టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైన అఫ్గాన్, తాజాగా యూఏఈతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మొదట బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టి యూఏఈని 160 పరుగులకే కట్టడి చేయగా, అనంతరం బ్యాటింగ్‌లో అజేయంగా 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇబ్రహీం జద్రాన్ (53) కీలక అర్ధసెంచరీతో రాణించాడు. ఈ గెలుపుతో గ్రూప్-డిలో అఫ్గాన్ ఆశలు సజీవంగా ఉండగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా అధికారికంగా 'సూపర్-8' దశకు అర్హత సాధించింది.
యూఏఈ బ్యాటర్లలో సోహైబ్ ఖాన్ (68) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగిలిన వారు విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే గుర్బాజ్ (0) వికెట్ కోల్పోయినప్పటికీ, ఒమర్జాయ్, దర్విష్ రసూలీ (33) సమయోచితంగా ఆడి మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేశారు. ఈ ఓటమితో యూఏఈ టోర్నీలో నాలుగో స్థానానికి పడిపోగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
