Let's talk: editor@tmv.in
నిస్వార్థ సేవలకు.. వరించిన పద్మశ్రీ

నిస్వార్థ సేవలకు.. వరించిన పద్మశ్రీ

Pinjari Chand
26 జనవరి, 2026

దేశంలో వెలుగులోకి రాకుండా, నిశ్శబ్దంగా సేవలందించిన అసాధారణ వ్యక్తులను గుర్తిస్తూ, 2026 సంవత్సరానికి గాను రిపబ్లిక్ డే సందర్భంగా ‘అన్‌సంగ్ హీరోలు’ (గుర్తింపులేని వీరులు) విభాగంలో 45 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సామాజిక సేవ, విద్య, సాహిత్యం, ఆరోగ్యం, ప్రజాసేవ, కళలు, సంప్రదాయ వృత్తులు, పరిశోధన వంటి విభిన్న రంగాల్లో జీవితాంతం అంకితభావంతో పనిచేసిన వారిని ఈ అవార్డులు గుర్తిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, అంచున ఉన్న వర్గాలు, గిరిజన సమాజాలు, దళితులు, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన సాధారణ వ్యక్తులు చేసిన అసాధారణ సేవలకు ఈ జాబితా అద్దం పడుతోంది.

బస్ కండక్టర్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాలయం వరకు

కర్ణాటకలోని మైసూరు సమీపంలోని హరళహల్లి గ్రామానికి చెందిన అంకే గౌడ ఒకప్పుడు బస్ కండక్టర్‌గా పనిచేశారు. పుస్తకాలపై అపారమైన ప్రేమతో ఆయన స్థాపించిన ‘పుస్తక్ మనే’ నేడు 20 భాషల్లో రెండు మిలియన్లకు పైగా పుస్తకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత గ్రంథాలయంగా నిలిచింది. విద్యాభివృద్ధికి చేసిన ఈ సేవలకు గాను ఆయనకు పద్మశ్రీ లభించింది.

శిశువుల ప్రాణాలు కాపాడిన మానవ పాల బ్యాంక్

ముంబైకి చెందిన పిల్లల వైద్యురాలు డా. ఆర్మిడా ఫెర్నాండెస్ ఆసియాలోనే తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి వేలాది శిశువుల జీవనా పరిస్థితులను మెరుగుపరిచారు. ఆమె సేవలు ఆరోగ్య రంగంలో మార్గదర్శకంగా నిలిచాయి.

గిరిజన సంప్రదాయాల పరిరక్షణ

మహారాష్ట్రకు చెందిన 90 ఏళ్ల భిక్ల్యా లడాక్య ధిండా గిరిజనుల సంప్రదాయ వాయిద్యమైన ‘టార్పా’ను పరిరక్షిస్తూ తరతరాలకు అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన భగవాన్‌దాస్ రాయ్‌కవార్ బుందేలీ యుద్ధకళ శిక్షకుడిగా పనిచేస్తూ సంప్రదాయ యుద్ధకళలకు జీవం పోస్తున్నారు.

నక్సల్ ప్రాంతాల్లో విద్యా వెలుగు

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసిన బుద్రీ థాటి విద్యను ఆయుధంగా మార్చి మార్పుకు దారితీశారు. ఒడిశాకు చెందిన సంతాలి రచయిత–సంగీతకారుడు చరణ్ హెంబ్రమ్ గిరిజన భాష, సంస్కృతికి విశేష సేవలందించారు.

సంప్రదాయ వృత్తులు, కళలకు గౌరవం

మొరాదాబాద్‌కు చెందిన పిత్తల కళాకారుడు చిరంజీవ్ లాల్ యాదవ్, గుజరాతీ సంప్రదాయ కళ ‘మాన్‌భట్’ నిపుణుడు ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యా, పుదుచ్చేరికి చెందిన ప్రాచీన తమిళ యుద్ధకళ ‘సిలంబం’ను పరిరక్షించిన కే. పాజనివేల్ కూడా అవార్డులకు ఎంపికయ్యారు.

శాస్త్ర పరిశోధన, భాషా సేవలు

హైదరాబాద్‌కు చెందిన జన్యుశాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ ఆఫ్రికా నుంచి భారత్‌కు మానవ వలసలపై చేసిన పరిశోధనలకు గాను గుర్తింపు పొందారు. 60 ఏళ్లుగా హిందీ ప్రచారానికి కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కైలాష్ చంద్ర పంత్ కు సాహిత్యం–విద్య విభాగంలో పద్మశ్రీ లభించింది.

జమ్దానీ నేయ్యాల కళల పునరుద్ధరణ

హర్యానాకు చెందిన ఖేమ్ రాజ్ సుంద్రియాల్ పానిపట్ ఖెస్, జమ్దానీ నేయ్యాల కళలను పునరుద్ధరించి వేలాది కార్మికులకు ఉపాధి, శిక్షణ అందించారు.

సమాజం కోసం జీవితాంతం అంకితం

ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు దివ్యాంగులు, మహిళలు, పిల్లలు, దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాయి. విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, స్థిరమైన అభివృద్ధి, ఉపాధి కల్పన వంటి రంగాల్లో వీరి సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఇతర అవార్డు గ్రహీతలలో

ఆర్మిడా ఫెర్నాండెస్, భగవన్ దాస్ రాయక్‌వార్, భిక్ల్యా లడాక్య ధిండా, బ్రిజ్ లాల్ భట్, బుద్రి టాటి, చరణ్ హెంబ్రమ్, గఫ్రుద్దీన్ మేవాటి జోగి, ఇందర్‌జిత్ సింగ్ సిద్ధూ, కొల్లక్కాయిల్ దేవకీ అమ్మ జీ, కుమారస్వామి తంగరాజ్, మహేంద్ర కుమార్ మిశ్రా, మీర్ హాజీభాయ్ కసంభాయ్, మోహన్ నగర్, నీలేష్ వినోద్‌చంద్ర మండ్లేవాలా, నూరుద్దీన్ అహ్మద్, పద్మ గుర్మెట్, పోఖిలా లేఖ్తేపి, రఘువీర్ తుకారాం ఖేద్కర్, రాజస్తపతి కలియప్ప గౌండర్, రామారెడ్డి మామిడి, రామ్‌చంద్ర గోడ్బోలే, సునీత గోడ్బోలే, సంగ్యూసాంగ్ ఎస్ పొంగెనర్, షఫీ షౌఖ్, శ్రీరంగ్ దేవాబా లాడ్, సిమాంచల్ పాత్రో, తగా రామ్ భీల్, టెచి గుబిన్, యుమ్నాం జాత్రా సింగ్ తదితరులు ఉన్నారు.

పద్మ అవార్డుల ప్రాముఖ్యత

పద్మ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. ఇవి

• పద్మ విభూషణ్ – అత్యంత విశిష్ట సేవలకు

• పద్మ భూషణ్ – ఉన్నత స్థాయి సేవలకు

• పద్మశ్రీ – ఏ రంగంలోనైనా విశేష సేవలకు

2026కు 131 పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

ధర్మేంద్ర, వీఎస్ అచ్యుతానందన్‌కు మరణానంతరం పద్మ విభూషణ్

2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇందులో రెండు డ్యుయో కేసులను ఒక్క అవార్డుగా పరిగణించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్‌కు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు.

ఈ జాబితాలో 5 పద్మ విభూషణ్‌లు, 13 పద్మ భూషణ్‌లు, 113 పద్మశ్రీలు ఉన్నాయి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఈ అవార్డులతో గౌరవించారు.

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు

• ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం) – కళలు – మహారాష్ట్ర

• కేటీ థామస్ – ప్రజాపరిపాలన – కేరళ

• వయోలిన్ విద్వాంసురాలు ఎన్. రాజమ్ – కళలు – ఉత్తరప్రదేశ్

• ప్రముఖ మలయాళ జర్నలిస్టు పి. నారాయణన్ – సాహిత్యం, విద్య – కేరళ

• వీఎస్ అచ్యుతానందన్ (మరణానంతరం) – ప్రజాపరిపాలన – కేరళ

పద్మ భూషణ్ అవార్డు గ్రహీతల్లో ముఖ్యులు

అల్కా యాగ్నిక్, భగత్ సింగ్ కోశ్యారీ, డాక్టర్ కేఆర్ పాలనిస్వామి, మమ్ముట్టి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, పీయూష్ పాండే (మరణానంతరం), శిబు సోరెన్ (మరణానంతరం), ఉదయ్ కోటక్, విజయ్ అమృత్‌రాజ్ తదితరులు ఉన్నారు.

మొత్తం అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉన్నారు. ఆరుగురు విదేశీ పౌరులు / ఎన్‌ఆర్‌ఐలు / పీఐఓలు / ఓసీఐలు, 16 అవార్డులు మరణానంతరం ప్రకటించారు. పద్మ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. సాధారణంగా మార్చి–ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు.