Let's talk: editor@tmv.in
నిశ్చితార్థంలో బంగారం మాయం.. కొరియర్‌లో వాపస్

నిశ్చితార్థంలో బంగారం మాయం.. కొరియర్‌లో వాపస్

Panthagani Anusha
17 మార్చి, 2026

శుభకార్యాల్లో చోటుచేసుకునే దొంగతనాలు సాధారణమే కానీ పోయిన సొమ్ము తిరిగి యజమాని ఇంటికే చేరడం మాత్రం వింతే. నాయుడుపేటలో జరిగిన ఒక నిశ్చితార్థ వేడుకలో అపహరణకు గురైన బంగారు ఆభరణాలు, సుమారు 20 రోజుల తర్వాత కొరియర్ ద్వారా తిరిగి బాధితుల ఇంటి గడపకే చేరడం ఇప్పుడు స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. దొంగ మనసు మారి పంపాడా లేక పోలీసుల నిఘాకు భయపడి వెనక్కి ఇచ్చేశాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తిరుపతికి చెందిన ఒక దంపతులు ఇటీవల నాయుడుపేట లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. వేడుక సందడిలో ఉండగా వారు తెచ్చుకున్న విలువైన బంగారు ఆభరణాలు అకస్మాత్తుగా మాయమయ్యాయి. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాధితులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లోనే దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. చోరీ జరిగిన దాదాపు 20 రోజుల తర్వాత బాధితుల ఇంటికి ఒక అనామక కొరియర్ పార్శిల్ వచ్చింది. ఆశ్చర్యంగా అందులో వారు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి. పోయాయనుకున్న నగలు తిరిగి రావడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ పరిణామం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.

ఈ ఘటనపై నాయుడుపేట డీఎస్పీ జి.చంతిబాబు స్పందిస్తూ నిశ్చితార్థంలో మాయమైన నగలు కొరియర్ ద్వారా తిరిగి రావడం విశేషం. మేము ఆ ఆభరణాల నుంచి వేలిముద్రలను సేకరించాం. ఈ పని చేసింది కుటుంబానికి అత్యంత సన్నిహితులు లేదా తెలిసిన వారే అయి ఉంటారని అనుమానిస్తున్నాం. పట్టుబడతామనే భయంతోనే నగలను తిరిగి పంపి ఉండవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆ కొరియర్ ఎక్కడి నుంచి బుక్ అయిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. శుభకార్యాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

నిశ్చితార్థంలో బంగారం మాయం.. కొరియర్‌లో వాపస్ - Tholi Paluku